YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

అప్రమత్తంగా ఉండండి..దూసుకువస్తున్న ప్రచండ అలలు; సునామీ హెచ్చరికల సంస్థ హెచ్చరికలు

అప్రమత్తంగా ఉండండి..దూసుకువస్తున్న ప్రచండ అలలు; సునామీ హెచ్చరికల సంస్థ హెచ్చరికలు

మండుతున్న ఎండలు, ప్రత్యేక వాతావరణ పరిస్థితులు, ప్రచండమైన గాలుల కారణంగా భారత తూర్పు తీరంలోని సముద్రంలో భారీ అలలు ఎగసి పడే ప్రమాదముందని సునామీ హెచ్చరికల సంస్థ (ఇన్ కాయిస్) హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 24 నుంచి 26 తేదీల వరకూ సముద్రంలో భారీగా అలలు ఎగసి పడే సూచనలు ఉన్నాయని స్పష్టం చేసింది. భారత తూర్పు తీరంలోని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ్‌బంగా తీర ప్రాంతాల్లోని సముద్రం అల్లకల్లోలంగా మారిందని ఇన్ కాయిస్ హెచ్చరికలు జారీ చేసింది.ప్రస్తుతం అండమాన్ వైపు నుంచి భారత ప్రధాన భూభాగం తీరం వైపునకు ప్రచండ అలలు దూసుకువస్తున్నాయని ఇన్‌కాయిస్‌వెల్లడించింది. అలల దాదాపుగా 3-4 మీటర్ల ఎత్తున ఉండే అవకాశముందని స్పష్టం చేసింది. ఇవి తీరానికి చేరుకునే సమయంలో మరింత ఉద్ధృతంగా ఉంటాయని తెలిపింది. బలమైన అలలు హఠాత్తుగా ఎగసిపడతాయని.. తీరప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రత్యేకించి తీర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి సముద్రపు అలలు చొచ్చుకువచ్చే ప్రమాదముందని హెచ్చరించింది. సముద్ర తీరానికి దగ్గరగా నివసించే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ రెండు రోజుల పాటు సముద్ర స్నానాలు నిలిపివేసేలా చర్యలు చేపట్టాలని తీరప్రాంత జిల్లాల యంత్రాంగానికి హెచ్చరికలతో కూడిన సూచనలు ఇచ్చింది. అదే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా మారినందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా చూడాలని స్పష్టం చేసింది.ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు ఒడిశా, పశ్చిమ్‌బంగా‌పై ఈ అలల ఉద్ధృతి ఎక్కువ ప్రభావం చూపించే అవకాశముంది. ఆఫ్రికా సమీపంలో ప్రచండమైన గాలుల తీవ్రత కారణంగా సముద్రంలో భారీ అలలు ఏర్పడ్డాయని.. ఇప్పటికే అలలు పశ్చిమ తీరంలోని చాలా ప్రాంతాలను తాకాయని ఇన్ కాయిస్ వెల్లడించింది. అరేబియా సముద్రంలోని ఆయా ప్రాంతాల్లో 4-5 మీటర్లఎత్తున అలలు ఎగసిపడుతున్నాయని స్పష్టం చేసింది. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక తీరాల్లో పలు లోతట్టు ప్రాంతాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకువచ్చింది. కేరళలో వందకు పైగా ఇళ్లు సముద్రపు అలలు కారణంగా ధ్వంసమయ్యాయి.

Related Posts