సుందరకాండ పారాయణం అత్యంత ఫలదాయకం
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
తిరుమల, ఫిబ్రవరి 25
టిటిడి చేపట్టిన సుందరకాండ పారాయణం కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రతి ఇంట్లో భక్తులు పారాయణం చేస్తున్నారని, ఇది అత్యంత ఫలదాయకమని ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఉద్ఘాటించారు. తిరుమల నాదనీరాజనం వేదికపై బుధవారం ఉదయం జరిగిన సుందరకాండ పారాయణంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఉపన్యసిస్తూ సుందరకాండ శ్లోకాల శబ్ద తరంగాలు ప్రతి ఇంట్లో వ్యాపిస్తున్నాయని, దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ పెరిగి కరోనా వ్యాధి విముక్తికి మార్గం సుగమం అవుతుందని అన్నారు. యావత్ ప్రపంచానికి ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని అందిస్తున్న టిటిడి యాజమాన్యానికి, అదనపు ఈవో, ఎస్వీబీసీ ఎండి శ్రీ ఎవి.ధర్మారెడ్డికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. రామకథ తెలిసి చెప్పుకున్నా, తెలియక చెప్పుకున్నా గొప్ప అభ్యున్నతి కలుగుతుందన్నారు. సుందరకాండలో అడుగడుగునా రామచంద్రుని గుణగానం వినిపిస్తుందని చెప్పారు. రామకథ చనిపోయే వారిని కూడా బతికిస్తుందని వాల్మీకి మహర్షి తెలియజేశారని వివరించారు. రామకార్యంలో వానరులకు మాటసాయం చేసిన సంపాతికి, హనుమంతునికి ఆతిథ్యమిచ్చిన మైనాకుడికి ఎంతో మేలు చేకూరిందని చెప్పారు.
లోక కల్యాణార్థం టిటిడి నిర్వహిస్తున్న పారాయణ యజ్ఞంలో భాగంగా మంత్ర పారాయణం ప్రారంభించి నేటికి 321 రోజులు పూర్తి కాగా, సుందరకాండ పారాయణం 259వ రోజుకు చేరుకుంది. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం శాస్త్ర పండితులు శ్రీ శేషాచార్యులు సుందరకాండ శ్లోకాలను పారాయణం చేయగా, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రత్యేకాధికారి డా. ఆకెళ్ల విభీషణ శర్మ అర్థ తాత్పర్యాన్ని, వైశిష్ట్యాన్ని తెలియజేశారు.