YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సీమ సీన్ మారుతోందా..

సీమ సీన్ మారుతోందా..

తిరుపతి, ఫిబ్రవరి 25, 
ఏమాత్రం బాగా లేదు. అనుకున్నది రివర్స్ అవుతుంది. జగన్ రివర్స్ షాట్ చంద్రబాబుకు తగిలింది. రాయలసీమలో అసలే అంతంత మాత్రంగా ఉన్న టీడీపీని పంచాయతీ ఎన్నికలు మరింత ప్రమాదంలో పడేశాయనే చెప్పాలి. రాయలసీమలో ఏ జిల్లాలో చూసినా టీడీపీ నేతలు పంచాయతీ ఎన్నికల కోసం బయటకు రాలేదు. ఆర్థికంగా అభ్యర్థులను ఆదుకోలేదు. ఫలితంగా కొన్ని ఏకగ్రీవం కాగా, మరికొన్నింటిలో వైసీపీ ఏకపక్ష విజయం సాధించింది.అసెంబ్లీ ఎన్నికల్లో రాయలసీమలోని కడప, కర్నూలు జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అనంతపురం జిల్లాలో రెండు స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు మినహా ఎవరూ గెలవలేదు. ఇంత దారుణంగా పార్టీ ఓడటంతో చంద్రబాబు ఈ ప్రాంతాలపై గత కొన్ని రోజులుగా దృష్టి పెట్టారు. పార్టీ కమిటీల్లోనూ సీమ ప్రాంత నేతలకు ప్రాధాన్యం ఇచ్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శుల నుంచి తెలుగు యువత అధ్యక్షుడి వరకూ రాయలసీమ నేతనే నియమించారుహేమాహేమీలు రాయలసీమ జిల్లాల్లో ఉన్నప్పటికీ ఏ ఒక్కరూ పెద్దగా పంచాయతీ ఎన్నికలను పట్టించుకోలేదంటున్నారు. ఇందుకు ప్రధానంగా ఆర్థికంగా అభ్యర్థులకు సర్దుబాటు చేయాల్సి వస్తుందన్నది ఒక కారణమైతే, అనవసర కేసులు నమోదవుతాయన్నది మరో భయం. ఫలితంగా అభ్యర్థులు అనేక చోట్ల ఉన్నా ఆర్థికంగా తట్టుకోలేక కొందరు పోటీ చేయకపోగా, మరికొందరు నామినేషన్లను ఉపసంహరించుకున్నారంటున్నారు.రాయలసీమలో జేసీ దివాకర్ రెడ్డి సోదరులు, కాల్వ శ్రీనివాసులు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కేఈ కృష‌్ణమూర్తి, భూమా ఫ్యామిలీ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది ఉద్దండులున్నా కీలక సమయంలో చేతులెత్తేశారంటున్నారు. ఇదే పంథాను సీమలో నేతలు కొనసాగిస్తే పార్టీకి పూర్వ వైభవం రావడం మాట అటుంచి పూర్తిగా ఇబ్బందుల్లో పడుతుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. రాయలసీమలో నిలదొక్కుకునేందుకు చంద్రబాబు మరో వ్యూహాన్ని రచించుకోవాల్సిందే. లేకుంటే మరోసారి సేమ్ సీన్ రిపీట్ అవుతుంది.
అమరావతి సంగతేంటి
ఏదైనా గుప్పిట మూసేంత వరకే రహస్యం. తెరిస్తే ఏమీ ఉండదు. ఇప్పుడు అమరావతి విషయంలోనూ అదే నిజమైంది. ఇప్పటి వరకూ చంద్రబాబు అమరావతిని నమ్ముకుని రాజకీయాలు నడుపుతూ వస్తున్నారు. ఐదు కోట్ల మంది ప్రజలు రాజధాని తరలింపును వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు. న్యాయపరంగా దానిపై పోరాటం చేస్తామని చెబుతున్నారు. ఇక అమరావతి ప్రాంతంలో రైతులు కూడా గత 425 రోజులకు పైగానే ఉద్యమాలు చేస్తున్నారు.కానీ రాజధాని అమరావతి ప్రభావం రాష్ట్రంలో ఎక్కడా లేదన్నది అర్థమయింది. ప్రధానంగా రాజధాని ప్రాంతంలో అనేక రోజులుగా ఉద్యమాలు నడుస్తున్నా ఎన్నికల ఫలితాల్లో మాత్రం అది కన్పించలేదు. నిజానికి రాజధాని తరలిస్తామని, మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని జగన్ ప్రకటించి దాదాపు పథ్నాలుగు నెలలు కావస్తుంది. ఈ పథ్నాలుగు నెలల నుంచి ఇక్కడ భూముల ధరలు పడిపోయాయి. చిరు వ్యాపారాలు కూడా జరగడం లేదన్న వార్తలు వస్తున్నాయి.అయినా సరే ఇక్కడి ప్రజలు మరోసారి పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి అండగా నిలవడం చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటి వరకూ పార్టీనేతలకు అమరావతి విషయంలో నచ్చ చెబుతూ వచ్చారు. రాజధాని అమరావతి తరలించడం ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా ఇష్టం లేదని ఆయన పదే పదే చెప్పుకొచ్చారు. రాయలసీమ లో హైకోర్టు వచ్చినందున ప్రయోజనం లేదని ఆ ప్రాంతనేతలను బుజ్జగించారు. కానీ ఎన్ని చేసినా అమరావతి విషయాన్ని రాష్ట్ర ప్రజలు లైట్ గా తీసుకున్నారన్నది మాత్రం ఫలితాలను బట్ట తేలింది.అందుకే నిన్న మొన్నటి వరకూ అమరావతి విషయంలో మాట్లాడిన నేతలు పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత నోరు మెదపడం లేదు. అమరావతి తనకు అందివస్తుందని చంద్రబాబు పెద్ద ఆశలు పెట్టుకున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ సంగతి దేవుడెరుగు.. కనీసం కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ టీడీపీకి అనుకూల ఫలితాలు రాకపోవడంపై ఆయన సీనియర్ నేతలతో విశ్లేషణలు చేస్తున్నారు. అమరావతి ఆయుధం అవుతుందనుకుంటే అది ప్రత్యర్థి చేతికి దానిని అందించినట్లయిందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Related Posts