రాజమండ్రి, ఫిబ్రవరి 25,
గోదావరి నదిలో సహజ నీటి లభ్యత ఆశాజనకంగానే ఉంది. ఎండలు ముదురుతున్న క్రమంలో గోదావరి నదిలో సహజ నీటి లభ్యతకు ఎటువంటి డోకా లేకుండా ఉంది. గత ఏడాది ఇదే సమయంలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద 12.75 మీటర్లు నీటి మట్టంలో జలాలు చేరితే, ఈ ఏడాది సరాసరిగా 13.16 మీటర్ల నీటి మట్టం ఉంది. కాటన్ బ్యారేజి వద్ద గోదావరి నది నీటి మట్టం 13.61 మీటర్లు నమోదైంది. ప్రస్తుతం సీలేరు నుంచి గోదావరి నదికి రోజుకు సరాసరిగా 5500 నుంచి ఆరు వేల క్యూసెక్కుల వరకు చేరుతున్నాయి. మొత్తం రబీ అవసరాలకు దాదాపు 90 టీఎంసీల తాగునీరు, సాగునీటితోపాటు సరిపోతాయని రబీ సీజన్ కార్యాచరణ చేపట్టారు. ఇప్పటి వరకు సుమారు 62 టీఎంసీలు జలాలను వినియోగించుకోవడం జరిగింది. ఇందులో సీలేరు నుంచి 33.70 టీఎంసీల వరకు వినియోగించుకుంటే ఇందులో సహజంగా గోదావరి నది నుంచి లభించిన జలాలు సుమారు 30 టీఎంసీల వరకు ఉన్నాయి. అంటే గత ఏడాది ఇదే సమయంతో పోల్చుకుంటే గోదావరి నదిలో ఏడాది సహజ నీటి లభ్యత ఆశాజకంగా కొనసాగుతున్నట్టే. ఈ ఏడాది సీలేరు నుంచి 45 టీఎంసీల వరకు అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు వినియోగించుకున్నది కాకుండా ఇంకా అదనంగానే విద్యుత్ ఉత్పత్తి అనంతర మిగులు జలాలను గోదావరి నదిలోకి విడిచి పెట్టే అవకాశం ఉంది కాబట్టి రబీ నీటి అవసరాలకు ప్రస్తుత పరిస్థితిని బట్టి పరిశీలిస్తే డోకాలేనట్టే. ఇటు గోదావరి సహజనీటి లభ్యత ఆశాజనకంగా ఉండటం, మరో వైపు సీలేరు నుంచి కూడా మిగులు జలాలకు అవకాశం ఉండటంతో రబీ అవసరాలకు ఇబ్బంది లేదని తెలుస్తోంది. కాటన్ బ్యారేజి నుంచి మూడు డెల్టాలకు కలిపి 7700 క్యూసెక్కుల జలాలను విడుదల చేశారు. ఇందులో పశ్చిమ డెల్టాకు 4000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. గోదావరి తూర్పు డెల్టాలో 2.64 లక్షల ఎకరాలు, గోదావరి మధ్యమ డెల్టాలో 1.72 లక్షల ఎకరాలు, గోదావరి పశ్చిమ డెల్టాలో 4.60 లక్షల ఎకరాలు రబీ సాగవుతోంది. సకాలంలో రబీని పూర్తి చేసి కాల్వలకు నీటి సరఫరా ముగించి వేసవి క్లోజర్ పనులను చేపట్టాలని జల వనరుల శాఖ అంచనా వేస్తోంది. గత ఏడాది చేపట్టిన పనులు, ఈ సీజన్ సమయంలో కొత్తగా చేపట్టాల్సిన పనులను చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. రబీ సీజన్ ఈ ఏడాది ఏప్రిల్ రెండో వారం వరకు కొనసాగేలా ఉంది. అప్పటి వరకు దాదాపు నీళ్లివ్వాల్సిందే. రబీ పొట్ట దశలో అధిక జలాలను ఇవ్వాల్సి వుంది