హైదరాబాద్, ఫిబ్రవరి 25,
రాష్ట్రంలో బుధవారం నుంచి 6,7,8 తరగతుల విద్యార్థులకు ప్రత్యక్ష బోధన ప్రారంభించారు. ఈనెల ఒకటి నుంచి 9,10 ఆపై తరగతుల వారికి ఇప్పటికే చేపట్టిన విషయం తెలిసిందే. అయితే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకపోవడంతో కింది స్థాయి తరగతులను ప్రారంభించాలని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు వచ్చాయి. అందులో భాగంగానే బుధవారం నుంచి వచ్చేనెల ఒకటి వరకు 6,7,8 తరగతుల విద్యార్థులకూ ప్రత్యక్ష బోధనకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకనుగుణంగా విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. విద్యాశాఖ హక్కు చట్టం ప్రకారం ఎనిమిదో తరగతి వరకు డిటెన్షన్ విధానం వర్తించబోదని స్పష్టం చేశారు. అంటే ఆ విద్యార్థులు పై తరగతులకు ప్రమోట్ అవుతారు. ఇప్పటికే 9,10 తరగతుల పిల్లలు బడులకు హాజరవుతున్నారు. తరగతి గదికి 20 మంది విద్యార్థులకే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బెంచీకి ఒకరు చొప్పున కూర్చుకోవాలని ఆదేశించింది. కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలనీ, విద్యార్థులు మాస్క్ ధరించాలనీ, శానిటైజర్ వాడాలనీ, భౌతిక దూరం ఉండాలని కోరింది. 8,891 సర్కారు బడుల్లో 6,7,8 తరగతులకు చెందిన విద్యార్థులు 6,88,742 మంది ఉన్నారు. 20 మంది చొప్పున వారికి 34,437 తరగతి గదులు అవసరమవుతాయి. సర్కారు బడుల్లో అన్ని తరగతి గదులున్నాయా?, ఉన్నవి సరిపోతాయా?అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటించడం కష్టమేనని తెలుస్తున్నది. ఇంకోవైపు తరగతి గదులు ఎక్కువైతే ఉపాధ్యాయుల సంఖ్య పెరగాల్సి ఉన్నది. విద్యావాలంటీర్ల నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీంతో సర్కారు బడుల్లో ఉపాధ్యాయుల కొరత వచ్చే అవకాశమున్నది. మరోవైపు తరగతి గదులను రోజూ శానిటైజ్ చేయడం, ప్రాంగణాలను, మరుగుదొడ్లను శుభ్రం చేసే పనులను స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం అప్పగించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పాఠశాలకూ స్వచ్ఛ కార్మికులను నియమించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. మరో వైపు దేశంలో కోవిడ్ బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నదని అధికారులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్నాటక, మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. కరోనా కొత్తరకం వైరస్ వస్తున్నది. ఆయా ప్రభుత్వాలు మళ్లీ లాక్‌డౌన్ విధించే అంశాలను పరిశీలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 6,7,8 తరగతుల విద్యార్థులకు ప్రత్యక్ష బోధన ప్రారంభించడం ఎంతవరకు సమంజసమని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడమేనని వాపోతున్నారు.