YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

సెనగ రైతులకు కష్టాలు ఇంతింత కాదయా

సెనగ రైతులకు కష్టాలు ఇంతింత కాదయా

నల్గొండ, ఫిబ్రవరి 25, 
యాసంగి పంటలు చేతికందే సమయంలో రైతులకు సమస్యలు చుట్టుముడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలతో యాసంగి నుంచి కొనుగోలు కేంద్రాలు ఉండవని రాష్ట్రప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, గ్రామాల్లో ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలు లేకపోయినా మార్కెట్‌ కేంద్రాల్లో పంటలు కొనుగోళ్లు జరుపుతామని పేర్కొంది. ఈ నేపథ్యంలో,, శనగ పంట చేతికొచ్చి సుమారు 20 రోజులు గడుస్తున్నా.. మార్కెట్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభానికి నోచుకోలేదు. రెండు, మూడు రోజులుగా వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో పంటను ఆరబెట్టిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రతేడాదీ మార్క్‌ఫెడ్‌ నుంచి కొనుగోలు చేస్తారని, కానీ ఈసారి ఇంకా కొనుగోళ్లు ప్రారంభించలేదని రైతులు తెలిపారు. దీన్ని అదునుగా భావించిన వ్యాపారులు.. అందిన కాడికి దండుకుంటున్నారు. శనగ మద్దతు ధర రూ.5100 ఉండగా.. రూ.4000-4200 ధరకు పంటను కొనుగోలు చేసి రైతులను నిలువునా ముంచుతున్నారు. నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వరి తర్వాత శనగ పంట అత్యధికంగా సాగవుతున్నది. సుమారు లక్షా నాలుగు వేల ఎకరాల్లో సాగవగా.. నిజామాబాద్‌లో 28 వేల ఎకరాలు, కామారెడ్డిలో సుమారు 76 వేల ఎకరాల్లో శనగ పంట సాగు చేశారు. ప్రస్తుతం పంట చేతికొచ్చి 20-25 రోజులవుతుండటంతో శనగలను ఆరబెట్టి కొనుగోలు కేంద్రాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదనీ, ఓ పక్క చిరుజల్లులు పడుతున్నాయని చేతికొచ్చిన పంట వర్షానికి తడిసిపోతే తమ పరిస్థితి ఏమిటని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం శనగ పంటకు రూ.5,100ల మద్దతు ధర ప్రకటించింది. కానీ ఇంకా కొనుగోలు కేంద్రాలు మాత్రం ప్రారంభించకపోవడం గమనార్హం. దీనికి తోడు వాతావరణ మార్పులతో చిరుజల్లులు పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీన్ని ఆసరాగా మలుచుకున్న వ్యాపారులు.. పంటను క్వింటాకు రూ.4000-4200 చెల్లిస్తూ రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే క్వింటాకు 1000 చొప్పున మిగిలేదని రైతులు చెబుతున్నారు. గతేడాదితో పోల్చితే పంట దిగుబడి తగ్గిందనీ, గతంలో ఎకరానికి 10-11 క్వింటాళ్ల దిగుబడి రాగా, ఈసారి 6-8 మధ్య వచ్చిందని రైతులు తెలిపారు. ఇటు దిగుబడి లేక, అటు ధర తగ్గి తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా ఎలాంటి ఫలితం లేకుండా పోతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

Related Posts