YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం విదేశీయం

నీరవ్ కు బిగిస్తున్న ఉచ్చు

నీరవ్ కు బిగిస్తున్న ఉచ్చు

గాంధీనగర్, ఫిబ్రవరి 26, 
నీరవ్‌ మోడీని భారత్‌ రప్పించే దిశగా మరో ముందడుగుపడింది. కుంటి సాకులతో తప్పించుకోవాలని చూసిన ఘరానా మోసగాడి ఎత్తుల్ని… పక్కా అధారాలతో చిత్తు చేసింది భారత్‌. దీంతో నీరవ్‌ను భారత్‌కు అప్పగించేందుకు లండన్‌ కోర్టు అంగీకారం తెలిపింది. బ్యాంకుల నుంచి వేల కోట్లు అప్పుగా తీసుకుని..కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోడీ చూట్టూ ఉచ్చు బిగుసుకుంది. అతన్ని భారత్‌కు అప్పగించాలని బ్రిటన్‌ కోర్టు తీర్పు చెప్పింది.పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో ఇండియాలో విచారణ ఎదుర్కోవాల్సిందేనని నీరవ్‌కు స్పష్టం చేసింది కోర్టు. నీరవ్‌ను అప్పగించాలంటూ భారత్‌ ఇచ్చిన ఎక్స్‌ట్రడిషన్‌ వారెంట్‌ ఆధారంగా 2019 మార్చి 19న అతన్ని లండన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో వాండ్స్‌వర్త్‌ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అతను కోర్టు వాయిదాలకు హాజరవుతున్నాడు. నీరవ్‌ మోడీ బ్యాంకుని ఎలా మోసం చేశాడు… చట్టానికి చిక్కకుండా తప్పించుకోడానికి ఎన్ని తప్పులు చేశాడనే విషయాన్ని యూకే కోర్టుకు వివరించింది భారత్‌. నీరవ్‌పై నమోదైన కేసుల విచారణను పూర్తి చేసేందుకు అతన్ని తమకు అప్పగించాల్సిందిగా కోరింది భారత్‌. ఈ సందర్భంగా భారత్‌ వినిపించిన వాదనలతో ఎక్స్‌ట్రడిషన్‌ కోర్టు ఏకీభవించింది.ముఖ్యంగా నీరవ్‌ మోడీ నేరం చేశాడని చెప్పడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కోర్టు స్పష్టం చేసింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కేసులో ఓ సాక్షిని ప్రభావితం చేసేందుకు నీరవ్‌ ప్రయత్నించడాన్ని తప్పుబట్టింది. అంతేకాదు… కోర్టు వ్యవహారాల్లో కూడా నీరవ్‌ కలుగజేసుకునే ప్రయత్నం చేశాడని వ్యాఖ్యానించింది. మనీలాండరింగ్ కేసులో నీరవ్‌ దోషి అని చెప్పడానికి అవసరమైన అన్ని ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది కోర్టు. తనపై ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర ఉందంటూ నీరవ్‌ చేసిన ఆరోపణల్ని బ్రిటన్‌ కోర్టు తోసిపుచ్చింది. ఈ వ్యవహారంలో రాజకీయ నాయకుల ప్రమేయానికి సంబంధించి గాని, వాళ్లు కల్పించుకునే ప్రయత్నం చేశారనడానికి గాని ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది కోర్టు.జైళ్లలోని వాతావరణంపైనా కీలక వ్యాఖ్యలు చేసింది యూకే కోర్టు. భారత్‌లో జైళ్లు భయానకంగా ఉంటాయంటూ నీరవ్‌ చేసిన వాదనల్నీ తోసిపుచ్చారు న్యాయమూర్తి. లండన్‌ జైలు కంటే… ముంబైలోని ఆర్థర్‌ రోడ్డులో గల కారాగారం మెరుగ్గా ఉంటుందని వ్యాఖ్యానించారు న్యాయమూర్తి. భారత్‌ జైళ్లలో హింసాత్మక ఘటనలు జరుగుతాయన్న నీరవ్‌ వాదనల్ని కొట్టి పారేసింది కోర్టు. అవి పూర్తిగా నిరాధారమైన ఆరోపణలుగా తేల్చింది న్యాయస్థానం. నీరవ్‌ ఆరోగ్యంగా ఉండడం వల్ల జైల్లో పెట్టొచ్చని వ్యాఖ్యానించింది కోర్టు. అంతగా అవసరమైతే ముంబైలో తగిన వైద్యం చేయించుకోవచ్చని సూచించింది. న్యాయపరమైన అడ్డంకులు తొలగడంతో నీరవ్‌ను భారత్‌కు తీసుకొచ్చే ప్రక్రియను ప్రారంభించారు అధికారులు.

Related Posts