YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

స్వతంత్రులతో ఎవరికి దెబ్బ

స్వతంత్రులతో ఎవరికి దెబ్బ

హైదరాబాద్, ఫిబ్రవరి 26,
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుంది. నామినేషన్లు భారీగానే దాఖలయ్యాయి. ప్రశ్నించే గొంతుకులమంటూ ఉద్యమ నేతలు, స్వతంత్ర అభ్యర్థులు పెద్దసంఖ్యలో బరిలో దిగారు. ముఖ్యంగా ఖమ్మం-వరంగల్‌-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెలంగాణ ఉద్యమ నేతలు, ప్రధాన పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు భారీ అనుచరగణంతో వచ్చి నామినేషన్లు అందజేశారు. భారీగా అభ్యర్ధులు పోటీలో ఉండటంతో అంతిమ లాభం ఎవరికన్న చర్చ మొదలైంది.మార్చి 14న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ జరుగుతుంది. ప్రధాన పార్టీలు ఇప్పటికే అస్త్రశస్త్రాలను సిద్ధం చేశాయి. అయితే స్వతంత్ర అభ్యర్థులు పెద్దసంఖ్యలో బరిలో దిగడంతో కొత్త చర్చ మొదలైంది. 76 మంది దాదాపు 123 సెట్ల నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి 22 మంది బరిలో నిలవగా.. ఈసారి ఆ సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. వీరి సంఖ్యకు తగ్గట్టుగానే పట్టభద్రుల ఓటర్లు కూడా భారీగా తమ పేర్లను నమోదు చేయించుకున్నారు.ఇంత మంది పోటీ చేయడం వల్ల ఓట్లు చీలి ఎవరి విజయావకాశాలు దెబ్బతింటాయో అన్న ఆందోళన నెలకొందట. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులకు దీటుగా ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేస్తున్నారు కొందరు ఇండిపెండెంట్లు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును సొమ్ము చేసుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలతో పోల్చితే ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 2 లక్షల నుంచి 4 లక్షల 92 వేలకు పెరిగింది. ఈ స్థాయిలో ఓటర్ల సంఖ్య పెరగడానికి బరిలో ఉన్న అభ్యర్థులే కారణం. నామినేషన్లు దాఖలు చేయడానికి ముందే భారీగా ఓటర్లను నమోదు చేయించారు.ఇప్పుడవే ఓట్లు అభ్యర్థుల గెలుపోటముల్లో కీలకంగా మారే అవకాశం ఉంది. టీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, టీజేఎస్‌ నుంచి ప్రొఫెసర్‌ కోదండరామ్‌, లెఫ్ట్‌ పార్టీల అభ్యర్థిగా జయసారథి రెడ్డి, యువ తెలంగాణ నుంచి రాణి రుద్రమ, స్వతంత్ర అభ్యర్దిగా తీన్మార్ మల్లన్న,ఇంటి పార్టీ నుంచి చెరుకు సుధాకర్‌ నామినేషన్లు వేసినవారిలో ఉన్నారు.ప్రధాన పార్టీలు కాకుండా స్వతంత్రులు పెద్దసంఖ్యలో నామినేషన్లు వేయడం వెనక మరో వ్యూహం ఉందని ప్రచారం జరుగుతోంది. కేవలం గుర్తింపు కోసం కాకుండా.. ఓట్ల చీలిక కోసమే కొన్ని ప్రధాన పార్టీలు స్వతంత్రులను ప్రోత్సహించాయని టాక్‌. దీనివల్ల బ్యాలెట్‌ పేపర్‌ పెద్దగా ఉంటుంది. అప్పుడు ప్రధాన పార్టీల అభ్యర్థులే ప్రచారంలో హైలెట్‌ అవుతారు. వారిలో తమకు నచ్చినవారికే మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తారని అభిప్రాయపడుతున్నారట. చివరికి ఈ స్ట్రాటజీ ఎవరికి లాభం చేస్తుందో అన్న ఉత్కంఠ అభ్యర్ధుల్లో మొదలైంది.

Related Posts