YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రేవంత్ కు అడగడుగునా అడ్డంకులు

రేవంత్ కు అడగడుగునా అడ్డంకులు

హైదరాబాద్, ఫిబ్రవరి 26, 
తెలంగాణ కాంగ్రెస్ లో ఆధిపత్యపోరు ఎన్నటికీ తొలగిపోదు. రేవంత్ రెడ్డిని కార్నర్ చేసేందుకు ఎప్పటికప్పుడు సీనియర్ నేతలు ప్రయత్నిస్తూనే ఉంటారు. రేవంత్ రెడ్డి ఇతర పార్టీల నుంచి రావడంతో ఆయకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నది కాంగ్రెస్ నేతల అభిప్రాయం. ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న వాళ్లకు అన్యాయం జరుగుతుందని సీనియర్ నేతలు ఎప్పటికప్పుడు అధిష్టానం దృష్టికి తీసుకు వస్తూనే ఉంటారు. కానీ రాహుల్ గాంధీ ఆలోచనలు వేరు.పార్టీలో యువతకే ప్రాధాన్యత ఇవ్వాలన్నది రాహుల్ గాంధీ ఆలోచన. దేశ వ్యాప్తంగా ఇదే ఆయన ఆచరణలో పెడుతున్నారు. రేవంత్ రెడ్డి పేరు పీసీసీ చీఫ్ గా ఖరారయిన సమయంలో సీనియర్ నేతలందరూ ఢిల్లీలో తిష్ట వేసి ఆయనకు వ్యతిరేకంగా పావులు కదిపారు. క్షేత్రస్థాయిలో రేవంత్ రెడ్డి పేరు చీఫ్ పదవికి బలంగా విన్పిస్తున్నా సీనియర్ నేతలు మాత్రం అంగీకరించడం లేదు. వి.హనుమంతరావు, మధు యాష్కి వంటి వారయితే రేవంత్ రెడ్డికి ఏపదవీ ఇవ్వాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాన్ని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు.ఎవరు అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డికి ప్రజల్లో ఒక గుర్తింపు ఉంది. కేసీఆర్ కుటుంబాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే సత్తా రేవంత్ రెడ్డికే ఉందన్నది క్యాడర్ అభిప్రాయం. రేవంత్ రెడ్డి వేసే పంచ్ లు కూడా జనాలను పార్టీకి దగ్గరకు చేస్తాయని నమ్మేవారు కూడా పార్టీలో అనేక మంది ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి ని పార్టీ చీఫ్ గా గుర్తించేందుకు సీనియర్ నేతలు ఎవరూ అంగీకరించడం లేదు. రేవంత్ రెడ్డి ఇటీవల అచ్చంపేట నుంచి అమన్ గల్ వరకూ పాదయాత్ర నిర్వహించారు.పార్టీ హైకమాండ్ అనుమతితోనే తాను పాదయాత్ర చేస్తున్నానని రేవంత్ రెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర మొదలుపెట్టగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పాదయాత్రకు సిద్ధమయిపోయారు. ప్రాజెక్టుల సాధన కోసం కోమటిరెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. ఇక మరో సీనియర్ నేత జగ్గారెడ్డి సయితం పాదయాత్ర చేస్తున్నారు. జగ్గారెడ్డి సదాశివపేట నుంచి గన్ పార్క్ వరకూ పాదయాత్ర చేస్తున్నారు. తన నియోజకవర్గంలో పెండింగ్ సమస్యల కోసం ఆయన యాత్ర చేస్తున్నారు. అయితే ఇన్నేళ్లు మౌనంగా ఉన్న నేతలు రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించగానే మొదలు పెట్టడం చర్చనీయాంశమైంది. రేవంత్ రెడ్డికి హైకమాండ్ వద్ద ప్లస్ కాకుండా ఉండేందుకే సీనియర్లు ఈ యాత్రలను ప్రారంభించారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

Related Posts