దేశీయం
వాణిజ్యపరమైన అడ్డంకులు కొత్తగా వస్తున్న నేపథ్యంలో భారతదేశం తన గళాన్ని గట్టిగా వినిపించింది. మంగళవారం బీజింగ్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ విదేశాంగ మంత్రుల మండలి సమావేశంలో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ రక్షణ వాదాన్ని దాని అన్ని రూపాల్లోనూ తిరస్కరించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా అమెరికాలో విస్తృతమవుతున్న వాణిజ్యపరమైన అడ్డంకుల నేపథ్యంలో సుష్మా ఈ పిలుపునిచ్చారు. షాంఘై సహకార సంస్థ దేశాల మధ్య చారిత్రక అనుబంధం ఉందని తెలిపారు. ఈ దేశాల మధ్య ఉమ్మడి అంశాలు చాలా ఉన్నాయన్నారు. ఈ అనుబంధాలు నిరంతరం నూతనోత్తేజం పొందుతున్నాయన్నారు. మన ఆర్థిక పెట్టుబడుల అనుబంధాలను బలోపేతం చేయడం కోసం షాంఘై సహకార సంస్థతో కలిసి భారతదేశం నిబద్ధతతో పని చేస్తోంది. మరింత విస్తృత కలుపుగోలు, ధర్మబద్ధ పరస్పర ప్రయోజనాల కోసం సమతుల్యతగల ఆర్థిక ప్రపంచీకరణ జరగాలని నమ్ముతున్నాంఅని తెలిపారు. నూతన పరిశోధనలు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, శాస్త్ర, సాంకేతిక రంగాలు, ఇంధనం, వ్యవసాయం, ఆహార భద్రత వంటి రంగాల్లో సహకారం విస్తరించాలన్నారు.చైనా దిగుమతులపై ఇటీవలే అమెరికా కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అల్యూమినియం, స్టీల్‌లపై టారిఫ్‌లను విధించింది. చైనా నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్న1300 రకాల ఉత్పత్తులపై ఈ టారిఫ్‌లు వర్తిస్తాయి. చైనా అనుసరిస్తున్న వాణిజ్య విధానాలను కట్టడి చేయడానికి ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా ప్రకటించింది. దీనిపై చైనా స్పందిస్తూ తాము కూడా అమెరికా ఉత్పత్తులపై ఇదే స్థాయిలో చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.భారత్-చైనా ప్రజల మధ్య సంబంధాలు బలోపేతం అయ్యేందుకు వీలుగా ఒకరి భాషను ఒకరు నేర్చుకోవాలని మరో సదస్సులో మాట్లాడుతూ సుష్మా అభిప్రాయపడ్డారు. హిందీ నేర్చుకుంటున్న 25 మంది చైనా విద్యార్థులు భారత్‌లో పర్యటించడానికి ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. కిర్గిజ్, ఉజ్బెక్ దేశాల మంత్రులతో సుష్మా సమావేశమై వాణిజ్యం, పెట్టుబడులు గురించి చర్చించారు. పాకిస్థాన్ విదేశాంగ, రక్షణ మంత్రులతో ఎలాంటి ద్వైపాక్షిక భేటీలూ ఉండబోవని భారత్ స్పష్టం చేసింది. రక్షణాత్మక ధోరణులు పెరిగిపోతున్న నేపథ్యంలో జిన్‌పింగ్-మోదీల భేటీతో ప్రపంచానికి అత్యంత సానుకూల ఫలితాలు వినిపించనున్నాయని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పేర్కొన్నారు. ప్రాంతీయంగానే కాకుండా ప్రపంచ శాంతి, సుస్థిరత, అభివృద్ధిలకు ఈ భేటీ దోహదపడుతుందని చెప్పారు.
రక్షణ వాదాన్ని తిరస్కరించాలి : సుష్మా స్వరాజ్