న్యూ ఢిల్లీ ఫిబ్రవరి 26 భారత్‌లో రైతుల ఆందోళనల నేపథ్యంలో ఖలిస్తాన్ మద్దతుదారులు హిందూ మైనారిటీలపై దాడులు చేస్తున్నారని కెనడాలో భారత సంతతికి చెందిన వారు నిరసనలకు దిగారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనలకు తాము వ్యతిరేకం కాదని, అయితే ఇక్కడ మాత్రం అది ఖలిస్తాన్ ఉద్యమంగా రూపొంది కెనడాలో హిందూ మైనారిటీలను టార్గెట్ చేస్తున్నారని ఎంపీ జగ్మీత్ సింగ్ కార్యాలయం వెలుపల ప్రదర్శన చేపట్టిన ఓ నిరసనకారుడు పేర్కొన్నారు. ఎలాంటి వివక్ష చూపకుండా ప్రతిఒక్కరినీ కాపాడాలని తాము నేతలను కోరుతున్నామని చెప్పారు. నిరసనకారుల్లో కొందరు కెనడా జెండాలను ప్రదర్శించారు.ఖలిస్తానీ గ్రూపుల నుంచి కెనడాలో భారత సంతతికి బెదిరింపులు వచ్చాయనే వార్తల నేపథ్యంలో తమ పౌరుల భద్రతకు చర్యలు చేపట్టాలని భారత్ ఇటీవల కెనడా అధికారులకు విజ్ఞప్తి చేసింది. కెనడాలో భారత పౌరుల భద్రతకు చర్యలు తీసుకోవాలని తాము కెనడా అధికారులను కోరామని, ఎలాంటి ఘటనలు చోటుచేసుకున్నా కెనడా పోలీసులతో పాటు భారత కాన్సులేట్స్‌కు సమాచారం అందించాలని భారత సంతతికి చెందిన వారికి విజ్ఞప్తి చేస్తున్నామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు.