న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27,
నాలుగు రంగాల్లో తప్ప ప్రభుత్వం మిగిలిన ఏరంగంలోనూ వ్యాపారం చేయదలచుకోలేదని ప్రధాని నరేంద్రమోడీ కుండబద్దలు కొట్టేశారు. వామపక్ష భావజాలికులు,ప్రతిపక్షాలు ఎంతగా మొత్తుకున్నా కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని అమలు చేసి తీరుతుంది. ప్రజలందరిపైనా తీవ్ర ప్రభావం చూపే నోట్ల రద్దు , వ్యవసాయ చట్టాల వంటి వాటినే పట్టాలపైకి ఎక్కించిన సర్కారు ఈ విషయంలో వెనకడుగు వేస్తుందనుకోవడం దింపుడు కళ్లెం ఆశలాంటిదే. ఉద్యోగుల బాధ్యతారాహిత్యం, అధికారుల , రాజకీయ నేతల అవినీతి కారణంగా ప్రభుత్వ రంగ సంస్థలు దివాలా తీస్తున్నాయి. వాటిని స్థాపించిన కాలాల్లో ఆయా రంగాల్లో పోటీ లేకపోవడంతో చెల్లుబాటయ్యాయి. ప్రయివేటు లో కనిపించే వేగంతో ప్రభుత్వ రంగ సంస్థలు పోటీ పడలేకపోతున్నాయి. నిర్ణయాల్లో జాప్యం, ఉత్పత్తి, సేవల్లో నాణ్యత లేమి, అవినీతి ప్రభుత్వ రంగాన్ని కుదేలు చేస్తున్నాయి. నష్టాల్లో కూరుకుపోయిన వాటిని ప్రజలు చెల్లించే పన్నులతో ఎందుకు పోషించాలనే ప్రశ్నకు సరైన సమాధానం దొరకడం లేదు. రక్షణ, మౌలిక వసతులు, రవాణా, విద్య, వైద్యం వంటి అంశాల్లో ప్రభుత్వ బాధ్యత ఎనలేనిది. మిగిలిన విషయాల్లో ప్రయివేటుకు అవకాశమిచ్చి నియంత్రణ బెత్తాన్ని తన చేతిలో పెట్టుకోవాలి. ప్రజల సొమ్మును ప్రభుత్వ రంగసంస్థల రూపంలో వృథా చేయడం అనవసరం . కానీ ప్రయివేటీకరణ జపంలో అనుచితంగా లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను పప్పుబెల్లాలకు పంచిపెడితే ప్రభుత్వాలు జాతికి ద్రోహం చేసినట్లే. అయిదు, పదేళ్ల పాటు అధికారంలో ఉండే ప్రభుత్వాలు ప్రజాధనానికి ధర్మకర్తలు మాత్రమే. వాటిని పూర్తిగా విక్రయించి భావితరాల అవసరాలకు శూన్యాన్ని మిగల్చడం సహించరానిది. అందుకే ప్రభుత్వ రంగ సంస్థలపై పోరు మారాలి. తీరు మారాలి. ఉద్యమ రూపు మారాలి.గ్లోబలైజేషన్ నేపథ్యంలో ప్రజల ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది. ఎక్కడ చౌకగా, నాణ్యంగా ఉత్పత్తి, సేవలు దొరుకుతుంటే వాటినే ఆశ్రయిస్తున్నారు. చైనా తో ఎంతటి శతృత్వం ఉన్నప్పటికీ నలభై శాతం ప్రజలు ఆ దేశం తయారు చేసే మొబైళ్లనే వాడుతున్నారు. వాటిని కొనమని ఎవరూ బలవంత పెట్టడం లేదు. అయినా ఎంచుకునే స్వేచ్ఛను ప్రజలు వినియోగించుకుంటున్నారు. స్వతంత్ర భారతంలో ప్రభుత్వాలు సబ్బుల తయారీ మొదలు అన్నిటా కంపెనీలు పెట్టేశాయి. అప్పట్లో అవసరాలు ఆ విధంగా ఉండేవి. కానీ క్రమేపీ ప్రజల్లో మార్పు వచ్చింది. క్వాలిటీ కోసం ఎగబడుతున్నారు. ప్రభుత్వం పేరు చెబితే అలసత్వం, అవినీతికి మారుపేరుగా ముద్ర పడిపోయింది. ఇందుకు చాలామేరకు రాజకీయ అవినీతి, ఉద్యోగుల్లో నెలకొన్న నిరాసక్తత, ఉదాసీనతలే కారణం. ఇప్పటికిప్పుడు దీనిని మార్చడం కూడా సాధ్యం కాదు. అందుకే ప్రజల దృష్టి కోణంలో ప్రభుత్వ సంస్థలపై ఏర్పడిన ప్రతికూలతను చెరిపేయలేం. ప్రజల్లో కనిపిస్తున్న ఈ మార్పును ఆసరాగా చేసుకుంటూనే నరేంద్రమోడీ వాటిని విక్రయించేస్తానని ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. అయినా ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత రావడం లేదు. రాజకీయ నాయకులు, ఉద్యోగ సంఘాల ఉద్యమాలు తప్ప నిజంగా ప్రజల్లో వీటిపై ఆసక్తి కనిపించడం లేదు. అలాగని విక్రయాలను ప్రభుత్వ ఇష్టారాజ్యానికి వదిలేయకూడదు.బడా కార్పొరేట్ కంపెనీలు ప్రభుత్వ సంస్థలను తీసుకోవడానికి ఉత్సాహ పడుతున్నాయి. ఆయా సంస్థలను ఉద్దరిద్దామనే లక్ష్యంతో తీసుకోవడం లేదు. వాటి వెనక ఉన్న లక్షల కోట్ల రూపాయల విలువ చేసే భూములూ కార్పొరేట్లకు దఖలవుతాయి. విశాఖ ఉక్కు పరిశ్రమనే తీసుకుంటే దాదాపు లక్షా యాభై వేల కోట్ల రూపాయల విలువ చేసే 22 వేలకు పైగా ఎకరాలు కంపెనీ అధీనంలో ఉంది. ఉక్కు పరిశ్రమను ప్రభుత్వం ఎవరికి విక్రయించినా పదివేల కోట్ల రూపాయలో ఇరవై వేల కోట్ల రూపాయలో వస్తాయంతే. దీనిని దక్కించుకున్న కంపెనీ లక్ష కోట్ల పైచిలుకు స్థిరాస్తి లాభంతోనే వ్యాపారం మొదలు పెడుతుందన్నమాట. ఇక్కడే మోసం జరుగుతోంది. ప్రభుత్వాలు నడపలేకపోతే కంపెనీకి ఉండే యంత్రసామాగ్రి , ఉద్యోగులు సహా ఉత్పత్తిని , భవనాలను విక్రయించవచ్చు. భూమి యాజమాన్య హక్కును బదలాయించకూడదు. ఒకవేళ ఆ ప్రయివేటు యాజమాన్యం నిలదొక్కుకోలేకపోతే బై బ్యాక్ కింద ప్రభుత్వానికే మళ్లీ అప్పగించే షరతులుండాలి. లేకపోతే నాలుగైదు సంవత్సరాలు నడిపి నష్టాలు వస్తున్నాయనే నెపంతో కంపెనీని మూసేసి స్థలాలు అమ్మేసుకుంటాయి. దాంతో ఉద్యోగులూ వీధిన పడతారు. ప్రభుత్వ లక్ష్యమూ నెరవేరదు. అందుకే స్థల యాజమాన్య హక్కులు బదిలీ కాని షరతులతో కంపెనీలను విక్రయించాలి. అందుకు సిద్దపడిన వారు మాత్రమే పోటీలో నిలుస్తారు. ఈరకమైన డిమాండ్ తో ప్రజా ఉద్యమాలు రూపుదిద్దుకోవాలి. లేకుంటే ప్రభుత్వం తన వాదననే ప్రజలపై రుద్దుతుంది. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల, ప్రభుత్వ రంగ సంస్థల పట్ల సాదారణ ప్రజల్లో పెద్దగా సానుభూతి లేదు. ఎక్కడా ప్రజలనుంచి నిరసనలు, ఉద్యమాలు రావడం లేదు. విశాఖ ఉక్కు వంటి భావోద్వేగ అంశంలోనూ ప్రజలు స్పందించడం లేదు. ఉద్యోగ సంఘాలు, రాజకీయ నేతలే తమ ప్రయోజనాల కోణంలో రోడ్డెక్కుతున్నారు.పోటీ తత్వంలేకపోతే కచ్చితంగా ప్రజలకు నష్టం కలుగుతుంది. కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులు సహా ప్రభుత్వ రంగంలో పనిచేసేవారు 6 శాతం లోపుగానే ఉంటారు. పౌరులందరూ పన్నులు కడితేనే ప్రభుత్వం నడుస్తుంది. అందువల్ల ప్రజాసేవకులుగా ఉద్యోగులు విధి నిర్వహణ చేయాలి. కానీ ఆ ధోరణిని ప్రభుత్వోద్యోగులు కోల్పోతున్నారు. దానివల్ల ప్రజల్లో వారిపట్ల ప్రతికూలమైన అసంతృప్తి ఏర్పడుతోంది. బీఎస్ఎన్ఎల్ వంటి మౌలిక వసతులతో కూడిన అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ సేవలను కాదని , ప్రయివేటు సర్వీస్ ప్రొవైడర్లను ప్రజలు ఎందుకు ఆశ్రయిస్తున్నారు?. జాతీయ బ్యాంకులను పక్కనపెట్టి ప్రయివేటు బ్యాంకులకు ప్రజలు ఎందుకు క్యూ కడుతున్నారు? సేవల్లో తేడా ఉంది. జవాబుదారీతనం కనిపించడం లేదు. వేగం, ఆధునికత సంతరించుకోలేదు. ఈ తేడాను సరిచేసేందుకు ప్రభుత్వమూ శ్రద్ధ పెట్టడం లేదు. అందువల్లనే ప్రభుత్వ రంగ సంస్థలు క్రమేపీ కనుమరుగవ్వక తప్పని అనివార్యత ఏర్పడింది. దీనిని నివారించడం ఎవరి వల్ల కాదు. కానీ వాటికున్న ఆస్తులు ప్రజాధనం. అది కొందరు వ్యక్తుల పరం కాకుండా భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా కాపాడుకోవడం ఇప్పుడు పౌరసమాజంపై ఉన్న పెద్ద బాధ్యత. ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా నాయకులు చేసే ఉద్యమాలు చిత్తశుద్ధితో కూడినవి కావు. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ చేసే పని అదే. ప్రయివేటీకరణ మంత్రమే పఠిస్తుంది. ప్రతిపక్షంలో వ్యతిరేకిస్తుంది. అందువల్ల పార్టీల అజెండాలను సీరియస్ గా తీసుకోవడం అనవసర శ్రమ. ప్రయివేటీకరణలోనూ ఉద్యోగ భద్రత, సామాజిక ఆస్తుల సంరక్షణ అనే రెండు అంశాలతో అజెండా మార్చినప్పుడే పోరాటం నిజమైన ప్రజా ఉద్యమంగా మారుతుంది.