YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

మిర్చియార్డు తరలింపు చురుగ్గా ఏర్పాట్లు

మిర్చియార్డు తరలింపు చురుగ్గా ఏర్పాట్లు
ఆసియాలోనే అతిపెద్దదైన గుంటూరు మిర్చీయార్డును.. తరలించేందుకు రంగం సిద్దమైంది. ఒకప్పుడు గుంటూరు శివారు ప్రాంతంలో ఏర్పాటు చేసినా.. ఇప్పుడది గుంటూరు నడిబొడ్డుగా మారింది. గుంటూరు నగరంలో ఉన్న మిర్చియార్డుని సమీపంలోని గ్రామీణ ప్రాంతానికి తరలించేందుకు సన్నాహాలు ప్రారంభించింది ప్రభుత్వం. వేలకోట్ల రూపాయల వ్యాపార కేంద్రం గుంటూరు మిర్చియార్డు.. ఇప్పుడిది అక్కడి నుంచి తరలిపోతుంది. అవును మీరు విన్నది నిజమే.. గుంటూరు మిర్చియార్డును తరలించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. వాస్తవానికి 2008-09 ఆర్థిక సంవత్సరంలోనే యార్డుని తరలించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినప్పటికీ భూముల విషయం కొలిక్కి రాకపోవడంతో సాధ్యపడలేదు.  దీనికి తోడు ఈ యార్డు పై ఆధారపడి బ్రతుకుతున్న కూలీల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో యార్డు తరలింపు వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు అమరావతి రాజధాని దృష్ట్యా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అడ్డంకిగా ఉన్న మిర్చియార్డు తరలింపుపై  ప్రత్యేక దృష్టిపెట్టింది ప్రభుత్వం. దీంతో జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌.. మిర్చియార్డు తరలింపుపై  దృష్టి సారించారు. జిల్లాలోని ప్రత్తిపాడు మండలంలోని మల్లాయపాలెంలో ఉన్న వక్ఫ్‌భూముల్లోకి మిర్చియార్డును 
 
తరలించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం రెవెన్యూ, మార్కెటింగ్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కొద్దిరోజులుగా రెండు శాఖల అధికారులు క్షేత్ర పరిశీలన జరిపి భూముల స్వాధీనానికి నివేధిక సిద్ధం చేస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం ఓకే చెబితే ఆ వెంటనే తరలింపు ప్రక్రియని ప్రారంభిస్తామని అధికారవర్గాలు తెలిపాయిమద్రాసు వాణిజ్య పంటలు మార్కెట్‌ చట్టం కింద గుంటూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఏర్పాటైంది. కమిటీ ఏర్పాటై ఇంచుమించు ఐదు దశాబ్ధాలు పైనే అయింది. సుమారు 57 ఎకరాల విస్తీర్ణంలో యార్డుని నెలకొల్పారు. అప్పట్లో ఈ ప్రాంతం గుంటూరు నగరానికి శివారులో ఉండేది. ఇందులో ఐదు ఎకరాల్లో పరిపాలన భవనాలు, మిగిలిన 52 ఎకరాల్లో వేలం కేంద్రాలు, కమీషన్‌ ఏజెంట్ల దుకాణాలున్నాయి. గత రెండు దశాబ్ధాల్లో మిర్చి పంట సాగు పెరగడం, ఆంధ్రప్రదేశ్‌ నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా రైతులు మిర్చిని విక్రయానికి ఇక్కడికి తీసుకొస్తున్నారు. దీంతో సీజన్‌లో యార్డు సరిపోవడం లేదు. కారణంగా యార్డుకు సరుకు తీసుకొచ్చిన రైతులు దానిని విక్రయించేందుకు రెండు, మూడురోజులు ఇక్కడే వేచి ఉండాల్సిన పరిస్థితి.  2008 మే నెలలో యార్డులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ సందర్భంలో యార్డు అంతా పూర్తిగా కాలి బూడిదైంది. అప్పుడే యార్డుని గ్రామీణ ప్రాంతానికి తరలించాలని అనుకున్నారు. యార్డు అకౌంట్‌లో నగదు సమృద్ధిగా ఉండటంతో ఉన్న స్థలంలోనే అధునాతన సౌకర్యాలతో పునర్నిర్మించారు.. కమీషన్‌ ఏజెంట్లకు లైసెన్సులు మంజూరు చేయడాన్ని కమిటీ కొనసాగిస్తుండటంతో ఉన్న షెడ్లు సరిపోవడం లేదు. పైగా ఈనామ్‌కి మోడల్‌ మార్కెట్‌గా యార్డుని ఎంపిక చేశారు. మరోవైపు మిర్చియార్డు కారణంగా చుట్టుగుంట నుంచి హైవే వైజంక్షన్‌ వరకు పరిసర ప్రాంతాల్లో శీతల గిడ్డంగులు, మిర్చి తొడాలు తీసే కంపెనీలు, కారం తయారు చేసే పరిశ్రమలు వందల సంఖ్యలో ఉన్నాయి. పదేళ్ల క్రితమే మల్లాయపాలెంలోని 250 ఎకరాల్లో ఉన్న వక్ఫ్‌భూముల్లోకి యార్డుని తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవోని కూడా విడుదల చేసింది. అయితే వక్ఫ్‌భూములను రైతులు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. వీటిని స్వాధీనపరుచుకోవాలంటే ప్రభుత్వ స్థాయిలో విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి. కోర్టునుంచి స్టే ఉత్తర్వులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉంది. అంతేకాకుండా ప్రస్తుత యార్డుకు మంచి రోడ్డు కనెక్టివిటీ ఉంది. మల్లాయపాలెంకు రోడ్డు మార్గం సరిగాలేదు. దీని వలన వ్యాపారస్థులు, రైతులు అక్కడికి చేరుకోవడం కష్టమౌతుంది. ఈ నేపథ్యంలో యార్డు తరలింపునకు ఒక రోడ్‌మ్యాప్‌ని తయారు చేసి ఆ దిశగా ముందుకెళ్లాలని కలెక్టర్‌ శశిధర్‌ ఆదేశించారు.  మరోవైపు మిర్చియార్డు తరలిస్తే వందలాది కుటుంబాలు వీదిన పడతాయని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related Posts