రామమందిరానికి 2100 కోట్లు
లక్నో, మార్చి 1,
అయోధ్యలో నిర్మించనున్న రామ మందిర నిర్మాణానికి గత కొద్ది రోజులుగా ప్రపంచంలో ఉన్న రామ భక్తులందరూ భారీ మొత్తంలో విరాళాలు ఇచ్చారు. 44 రోజులుగా రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు, విశ్వ హిందూ పరిషత్ ల ఆధ్వర్యంలో నిధి సేకరణ కార్యక్రమం నిర్వహించారు. దేశంలో మూల మూలకూ వెళ్లి మందిర నిర్మాణం కోసం విరాళాలు సేకరించారు. ఇందులో బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. అయితే శనివారంతో విరాళాల సేకరణ కార్యక్రమం ముగియగా.. ఇప్పటి వరకు మొత్తం రూ.2,100 కోట్ల విరాళాలు వచ్చాయని ట్రస్టు కోశాధికారి గోవింద్ దేవ్ గిరి తెలిపారు.అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్లు ఖర్చవుతాయి. పూర్తిగా ఆలయ కాంప్లెక్స్ నిర్మాణానికి, ఇతర అభివృద్ధి పనులకు రూ.1100 కోట్లు అవుతాయి. ఆ మొత్తంలో విరాళాలను సేకరించాలని అనుకున్నాం. కానీ అనుకున్న దాని కన్నా ఎక్కువగా విరాళాలు వచ్చాయి. రామ భక్తులు భారీ ఎత్తున స్పందించి పెద్ద మొత్తంలో విరాళాలను అందజేశారు.. అని గిరి అన్నారు.అయితే అనుకున్న దానికన్నా ఎక్కువ మొత్తంలో విరాళాలు వచ్చినందున అయోధ్యలో మిగిలిన ఆలయాలతోపాటు అక్కడ గోశాలను ఏర్పాటు చేసి ఉచితంగా పాలను భక్తులకు అందించాలని, అలాగే అయోధ్యలో సంస్కృత యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ట్రస్టు భావిస్తోంది. కానీ దీన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. భక్తులు ఇచ్చిన విరాళాలు దుర్వినియోగం కాకుండా చూడాలని, కేవలం రామ మందిరం కోసమే వాటిని ఖర్చు చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై ఏం జరుగుతుందో చూడాలి.