హైదరాబాద్ మార్చ్ 1
హైదరాబాద్ ఎంపీ ఏఐఏఎంఐఎం చీఫ్, అసదుద్దీన్ ఒవైసీ కొవిషీల్డ్ వ్యాక్సిన్ సామర్థ్యంపై అనుమానం వ్యక్తం చేశారు. దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఆయన ఇండియా టీవీతో మాట్లాడుతూ.. కొవిషీల్డ్ గురించి కొన్ని విషయాలను వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ కేవలం 18 ఏళ్ల నుంచి 64 ఏళ్ల మధ్య వయసున్న వారికే సమర్థంగా పని చేస్తున్నదని, 64 ఏళ్లు దాటిన వారికి అంత సమర్థంగా పని చేయడం లేదని జర్మనీ ప్రభుత్వం చెప్పినట్లు ఒవైసీ తెలిపారు. ఇప్పుడు ప్రధాని మోదీ కూడా యాదృచ్ఛికంగా కొవాగ్జిన్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కొవిషీల్డ్‌పై ఈ అనుమానాలను నివృత్తి చేయాలని నేను మోదీ సర్కార్‌ను అడుగుతున్నాను అని అసద్ అన్నారు. నిజానికి భారత్ బయోటెక్ తీసుకొచ్చిన కొవాగ్జిన్ టీకాపై మొదట్లో చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. ఇంకా క్లినికల్ ట్రయల్స్ దశలోనే ఉన్న వ్యాక్సిన్‌కు ఎలా క్లియరెన్స్ ఇస్తారని పలువురు ప్రశ్నించారు. ఈ వ్యాక్సిన్‌ను ప్రధాని మోదీ తీసుకొని మిగతావారికి ఆదర్శంగా నిలవాలనీ అన్నారు. ఇప్పుడు 60 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రారంభించిన తొలి రోజే మోదీ.. ఆ కొవాగ్జిన్ టీకా తీసుకున్నారు.