హైదరాబాద్, మార్చి 2,
.గాంధీలోని వైద్యులు కరోనా పట్ల ఏమి జాగ్రత్తలు తీసుకుంటున్నారో అనుమానమే. ఓపీ ప్రారంభమై దాదాపు రెండు నెలలైంది. అప్పటి నుంచి కరోనా టెస్టుల కోసం వచ్చే అనుమానితులు, జనరల్ ఓపీ కోసం వచ్చే రోగుల కోసం ఒకటే గేటు వాడుతున్నారు. దాంతో పేషెంట్లు ఆందోళన చెందుతున్నారు. ఇక ఓపీ ముందు ఇస్టానుసారంగా వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. లోపలికి, బయటికి వచ్చి పోయే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఫలితంగా రోగులు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది.
అధ్వాన్నంగా నిర్వహణ..మేడ్చల్ జిల్లా కీసరకు చెందిన యాదగిరి తండ్రికి గత నెలలో యాక్సిడెంట్ అయింది. ఆరోగ్యశ్రీ పథకం వర్తించడంతో ఆయన్ను గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. ఆపరేషన్ కోసం పేరును రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెళ్లగా ఒరిజినల్ ఆరోగ్యశ్రీ కార్డు కావాలని ఆస్పత్రి సిబ్బంది కోరారు. జిరాక్స్ మాత్రమే ఉందని చెప్పడంతో రోగిని చేర్చుకోవడానికి నిరాకరించారు. దాంతో యాదగిరి ఆరోగ్యశ్రీ హెల్ప్‌లైన్ నెంబర్‌కు ఫిర్యాదు చేయడంతో అడ్మిట్ చేసుకున్నారు. కానీ ఏ రోజు ఆపరేషన్ చేస్తారు? అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. వారం రోజులుగా సంబంధిత వైద్యులను అడిగి అడిగి అలిసిపోయిన యాదగిరి చివరికి మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టర్‌ను ఫొన్‌లైన్‌లో సంప్రదించాడు. కలెక్టర్ గాంధీ వైద్యులతో మాట్లాడగా.. మరుసటి రోజు ఆపరేషన్ లిస్టులో పేరు చేర్చారు. తీరా పరీక్షలు చేయగా.. పల్స్ రేటు తక్కువగా ఉండటంతో వచ్చే వారానికి ఆపరేషన్ వాయిదా వేశారు. ఇలా 15 రోజులు గడిచిన తర్వాత క్షతగాత్రునికి ఆపరేషన్ చేసి డిశ్చార్జ్ చేశారు. ఇది ఒక్క యాదగిరి పరిస్థితే కాదు. గాంధీకి వచ్చే వారందరి స్థితి ఇదే.
కాలు విరిగినా.. చేయి విరిగినా.. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినా.. ఇంకేదైనా రోగమొచ్చినా రాష్ట్ర ప్రజలకు ముందుగా గుర్తొచ్చేది హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి. ఇది ఒకప్పటి మాట. గతంలో ఆస్పత్రికి వస్తే రోగాలు తగ్గుతాయని భావించే రోగులు.. ప్రస్తుతం ఆస్పత్రిని చూస్తేనే జంకే పరిస్థితులు ఏర్పడ్డాయి. హాస్పిటల్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ దుర్వాసన వెదజల్లుతోంది. శుభ్రత లేదు.. అధికారుల పర్యవేక్షణా కొరవడింది. కొన్ని మెడికల్ ఎక్విప్‌మెంట్లు పని చేయడం లేదు. ఓపీ దగ్గర ఫుల్ రష్ ఉంటుంది. కానీ కరోనా నిబంధనలు మాత్రం ఎక్కడా కనిపించవు. ఓపీకి ఎదురుగా ఇష్టానుసారంగా వాహనాలను పార్కింగ్ చేసినా అడ్మిస్ట్రేషన్ సిబ్బంది పట్టించుకోదు. ఇలా గాంధీ ఆస్పత్రికి వచ్చే రోగులకు అడుగడుగునా ఇబ్బందులే ఎదురవుతున్నాయి. ఒక్కసారి వచ్చి వెళ్లిన రోగులు మళ్లీ ఏదైనా ఘటన జరిగితే రావాలంటే భయబ్రాంతులకు గురవుతున్నారు.ఆస్పత్రిలో మెడికల్ ఎక్విప్‌మెంట్లు సరిగాపని చేయడం లేదు. పేరుకు మాత్రమే ఎంఆర్‌ఐ స్కాన్ ఉంది. ఇది ఎప్పుడు పని చేస్తుందో.. ఎప్పుడు పని చేయదో.. ఎవ్వరికీ తెలియదు. ఒక్కసారి రిపేర్ చేయిస్తే కేవలం రెండు నెలలు మాత్రమే పని చేస్తుంది. మిగతా రోజులు మూలకే పడిపోతుంది. దాంతో ఎంఆర్‌ఐ స్కాన్ కోసం వచ్చే రోగులను ఉస్మానియా ఆస్పత్రికి రిఫర్ చేస్తున్నారు. ఫలితంగా రోజుల తరబడి రిపోర్టుల కోసం వేచి చూడాల్సి వస్తోంది. క్యాత్ ల్యాబ్ ఏండ్లుగా మూలకే.. టూ డీ ఎకో మెషిన్లు నాలుగు ఉంటే రెండు మాత్రమే పని చేస్తున్నాయి. సిటి స్కాన్లు రెండు ఉంటే ఒకటి సెపరేట్‌గా కరోనా పేషెంట్ల కోసమే వాడుతున్నారు. ఇలా అన్ని డిపార్టుమెంట్లలోనూ సగానికిపైగా మెషిన్లు, ఇతర పరికరాలు పని చేయడం లేదు. దాంతో రోగులు రోజుల తరబడి ఆస్పత్రి చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి ఉంది.ఆస్పత్రి బయట, లోపల సెల్లారు.. ఎక్కడచూసినా చెత్తా, చెదారం పేరుకుపోయి కంపు కొడుతోంది. ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. రాత్రయితే చాలు దోమలు పరేషాన్ చేస్తున్నాయి. దీనికితోడు మెయిన్ బిల్డింగ్ సెల్లార్‌లోని డైట్ క్యాంటీన్ వద్ద స్లాబ్ సీలింగ్ నుంచి నీరు లీకవుతుండగా.. పెచ్చులు ఊడి ఎక్కడ మీద పడుతాయోనని రోగులు, వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు.గాంధీలో ఫైర్ సేప్టీని గాలికి వదిలేయడంతో ఏమైనా దుర్ఘటన జరిగితే పరిస్థితి ఏంటనే ఆందోళన వ్యక్తమవుతోంది. జనవరి 6వ తేదీన అర్థరాత్రి గాంధీ మెయిన్ బిల్డింగ్‌లోని మూడో ఫ్లోర్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. మెడికల్ పరికరాలు కాలిపోయాయి. ఫైర్ సేప్టీ లేకపోవడంతో సెక్యూరిటీ గార్డులు డ్రమ్ముల నుంచి నీరు తీసుకొచ్చి మంటలను ఆర్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంటలు వ్యాపించి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. నిరుపేదలకు పైసా ఖర్చు లేకుండా గాంధీ ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలు పొందవచ్చని భావించిన రోగులకు ఇన్ని సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఆస్పత్రిలో కనీస వైద్యసేవలు అందకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సౌకర్యాలు మెరుగుపడేలా చూడాలని కోరుతున్నారు