లక్నోమార్చ్ 2 ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ జిల్లాలో మరో దారుణం జరిగింది. లైంగిక వేధింపుల కేసులో జైలుశిక్ష పడిన ఓ వ్యక్తి బెయిల్‌పై వచ్చి బాధితురాలి తండ్రిని కాల్చి చంపాడు. హత్రాస్ పోలీస్ చీఫ్ వినీత్ జైస్వాల్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన గౌరవ్‌శర్మ అనే వ్యక్తి 2018లో అదే గ్రామానికి చెందిన ఓ యువతిని లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. హెచ్చరించినా అతను తీరు మార్చుకోకపోవడంతో బాధితురాలి తండ్రి 2018 జూలైలో గౌరవ్ శర్మపై వేధింపుల కేసు పెట్టాడు. ఈ కేసులో శిక్షపడిన గౌరవ్ శర్మకు ఒక నెల తర్వాత స్థానిక కోర్టు బెయిల్ మంజూరుచేసింది. దాంతో అతను జైలు నుంచి విడుదలై గ్రామానికి వచ్చాడు. అప్పటి నుంచి బాధితురాలి కుటుంబాన్ని బెదిరించడం మొదలుపెట్టాడు. దాంతో ఇరు కుటుంబాల మధ్య అంతర్గతంగా వైరం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో గౌరవ్ శర్మభార్య, అత్త గుడికి వెళ్లారు. అదే సమయంలో లైంగిక వేధింపుల బాధితురాలు, ఆమె సోదరి కూడా ఆలయానికి వచ్చారు. ఈ సందర్బంగా ఇరువురి మధ్య వివాదం జరిగింది. ఈ విషయాన్ని గౌరవ్ శర్మ భార్య ఫోన్‌లో అతనికి తెలియజేయడంతో కోపంతో అక్కడికి చేరుకున్నాడు. తన బంధువులను, స్నేహితులను కూడా అక్కడికి పిలిపించి పెద్ద గొడవ చేశాడు. దాంతో లైంగిక వేధింపుల బాధితురాలి తండ్రి కూడా విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్నాడు. అతడిని చూడగానే రెచ్చిపోయిన గౌరవ్ శర్మ కాల్పులు జరిపాడు. దీంతో తీవ్రంగా గాయపడిన బాధితుడు దవాఖానలో చికిత్స పొందుతూ మరణించాడు. కాగా, నిందితుడు పథకం ప్రకారమే తన తండ్రి తన ముందుకు వచ్చేలా చేసి కాల్పులు జరిపి చంపాడని లైంగిక వేధింపుల బాధితురాలు ఆరోపించింది. తనపై వేధింపులకు పాల్పడినందుకు అతడిని జైలుకు పంపించాడన్న అక్కసుతోనే తన తండ్రిని పొట్టనపెట్టుకున్నాడని విలపించింది. తమకు న్యాయం చేయాలని, బాధితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.