ముంబై మార్చ్ 2 ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) వేదికల జాబితా నుంచి ముంబైని తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈసారి ఆ రాష్ట్రం బయటే టోర్నీ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. అదే నిజమైతే ముంబై బయట ఐపీఎల్ ఇదే తొలిసారి అవుతుంది. పైగా డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్ కూడా ఇదే కావడం విశేషం. ముంబై స్థానంలో హైదరాబాద్ వచ్చి చేరినట్లు ఈఎస్‌పీఎన్ క్రికిన్ఫో వెల్‌గడించింది. ప్రస్తుతం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, అహ్మదాబాద్, ఢిల్లీలు ఐపీఎల్ రేసులో ఉన్నట్లు తెలిపింది. అయితే దీనిపై బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అటు టోర్నీ ఎప్పుడు ప్రారంభమవుతుందో కూడా బోర్డు ఇంకా స్పష్టంగా చెప్పలేదు. అయితే ఏప్రిల్ 8-12 మధ్య ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.నిజానికి ఈసారి ముంబై, పుణెలే ప్రధాన వేదికలుగా ఐపీఎల్ నిర్వహించాలని మొదట బీసీసీఐ భావించింది. గత నెల 18న చెన్నైలో జరిగిన ఐపీఎల్ వేలంలో ఇదే విషయాన్ని ఫ్రాంచైజీలకు కూడా చెప్పారు. అయితే గతవారం అహ్మదాబాద్‌లో ఇండియా, ఇంగ్లండ్ మూడో టెస్ట్ సందర్భంగా ముంబైపై ప్రధానంగా చర్చ జరిగింది. అక్కడ కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ముంబైలో ఐపీఎల్ వద్దని బీసీసీఐ, ఐపీఎల్ అధికారులు చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో బీసీసీఐ కార్యదర్శి జే షాతోపాటు కోశాధికారి అరుణ్ దుమాల్, ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ పాల్గొన్నారు. ముంబై కాకుండా వివిధ నగరాల్లో ఐపీఎల్ నిర్వహించాలని కూడా ఆ సమావేశంలోనే నిర్ణయించారు. అయితే ఆ నగరాలపైనే ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ లిస్‌్కలో హైదరాబాద్, మొహాలీ, జైపూర్‌లు లేకపోవడంపై ఆయా ఫ్రాంచైజీలు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇటు తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి కేటీఆర్, హెచ్‌సీఏ తరఫున అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ కూడా ఐపీఎల్‌ను హైదరాబాద్‌లో నిర్వహించడానికి బీసీసీఐపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.