న్యూయార్క్ మార్చ్ 2 2027కల్లా అంతరిక్షంలో హోటల్ సిద్ధం కాబోతోంది. ఆర్బిటల్ అసెంబ్లీ అనే సంస్థ ఈ హోటల్‌ను నిర్మిస్తోంది. 2025లో నిర్మాణం మొదలుపెట్టి.. 2027కల్లా స్పేస్ టూరిస్టులకు అందుబాటులోకి తేవాలని ఈ సంస్థ భావిస్తున్నట్లు డైలీ మెయిల్ పత్రిక వెల్లడించింది. లో ఎర్త్ ఆర్బిట్‌లో ఈ హోటల్ నిర్మాణం జరగనుంది.ఈ స్పేస్ హోటల్‌లో రూమ్స్‌లాగే ప్రత్యేకంగా వ్యక్తిగత పాడ్స్ ఉంటాయి. వీటిని చుట్టూ తిరిగే ఓ చక్రానికి కలిపి ఉంచుతారు. మొత్తంగా ఇది ఎక్స్ ఆకారంలో ఉంటుంది. ఇందులో రెస్టారెంట్లు, హెల్త్ స్పా, సినిమా థియేటర్, జిమ్‌లు, లైబ్రరీలు, భూమిని చూసేందుకు ప్రత్యేకంగా లాంజ్‌లు, బార్లు కూడా ఉండనున్నాయి. మొత్తం 400 మందికి ఈ హోటల్ ఆతిథ్యమిచ్చేలా నిర్మించబోతున్నారు. ఈ హోటల్ భూమిని 90 నిమిషాలకు ఒకసారి చుట్టేసి వస్తుంది. కావాలనుకుంటే ఇందులో 20×12 మీటర్ల మాడ్యూల్స్‌ను కూడా కొనుక్కోవచ్చు. ఈ నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో మాత్రం సంస్థ ఇంకా చెప్పలేదు. భూమిపై ఉన్న ప్లేస్‌లన్నీ చూసి బోర్ కొట్టిందా? అయితే అంతరిక్షంలో విహరించడానికి సిద్ధమైపోండి. ఓ వీకెండ్‌లో అలా సరదాగా భూమి నుంచి అంతరిక్షంలోకి వెళ్లి అక్కడి హోటల్‌లో రెండు రోజులు గడిపి రావచ్చు.