పెట్రోల్, డీజిల్ పై ఉన్న ఎక్సైజ్ డ్యూటీలను తగ్గించే ఆలోచనలో ఆర్థిక శాఖ ఉన్నట్లు ముగ్గురు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. గతేడాది కరోనా సమయంలో ముడి చమురు ధరలు పతనమవడంతో కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీని పెంచుకుంటూ వెళ్లింది. అయితే గత పది నెలలో ఈ ధరలు రెట్టింపయ్యాయి. ఆ ప్రభావం పెట్రోల్, డీజిల్ ధరలపై పడింది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ రిటెయిల్ ధరల్లో 60 శాతం పన్నులు, డ్యూటీలే ఉన్నాయి.అయితే ప్రస్తుతం ప్రభుత్వ ఆదాయానికి పెద్దగా గండి పడకుండా సామాన్యులపై పన్నుల భారం తగ్గించడం ఎలాగన్న అంశంపై పలు రాష్ట్రాలు, ఆయిల్ కంపెనీలు, సంబంధిత మంత్రిత్వ శాఖతో ఆర్థిక శాఖ సంప్రదింపులు జరుపుతోంది. ధరలు స్థిరంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు సదరు అధికారులు తెలిపారు. ఈ మధ్యే పన్నుల తగ్గింపుపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడిన విషయం తెలిసిందే. పన్నులను ఎప్పుడు తగ్గిస్తామో తెలియదు కానీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై చర్చలు జరపాల్సిన అవసరం ఉన్నదని ఆమె అన్నారు.