కరోనా మహమ్మారి వ్యాప్తి ఇప్పుడప్పుడే తగ్గే అవకాశాలు లేవని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకటించింది. ఈ ఏడాది చివరికల్లా కరోనా విస్తృతి ఆగిపోతుందనుకోవడం అత్యాశే అవుతుందని తెలిపింది. అలాంటి ప్రచారాలు పూర్తిగా అవాస్తవమని స్పష్టంచేసింది. సమర్థవంతమైన కరోనా టీకాలవల్ల మరణాలు, ఆస్పతుల పాలయ్యేవారి సంఖ్య మాత్రం గణనీయంగా తగ్గుతుందని డబ్ల్యూహెచ్‌ఓ ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ మైకేల్ ర్యాన్ వెల్లడించారు. వైరస్ కట్టడికి టీకాలు తోడ్పడుతున్నాయని పేర్కొన్న ఆయన.. ఆలస్యంగానైనా కొవిడ్ వ్యాప్తిని నియంత్రిస్తామన్న విశ్వాసం ఉందన్నారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నియంత్రణలోనే ఉందని, అయితే రూపాంతరం చెందుతున్న వైరస్ రకాలు ప్రమాదకారిగా మారే అవకాశముందని హెచ్చరించింది. మహమ్మారి నిర్మూలనకు అన్ని దేశాలు సమష్టిగా పనిచేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.