YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ స్పీడ్

మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ స్పీడ్

ఏలూరు, మార్చి 3, 
ఏపీ పంచాయతీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ చేసుకున్న వైసీపీ అదే దూకుడుతో మున్సిపల్ ఎన్నికల్లోనూ స్పీడ్ పెంచింది. మొదటి నుంచి టీడీపీకి పట్టున్న ఓ కార్పొరేషన్లో వైసీపీ దూసుకుపోతుంటే టీడీపీకి ఎదురుగాలి వీస్తోంది. పదవులన్నీ అనుభవించిన నేతలు ప్రతిపక్షంలోకి రాగానే మొహం చాటేయడంతో..తమ్ముళ్లు ఒంటరి వాళ్లై పోయారు. కనీసం లీడ్ చేసే నాయకుడు కూడా లేక తలోదారి చూసుకుంటున్నారు.పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్లో టీడీపీకి దిశా నిర్దేశం చేసే నాయకుడే కరవయ్యాడు. గత మున్సిపల్‌ ఎన్నికల్లో అప్పటి ఎమ్మెల్యే బడేటి బుజ్జి పార్టీని లీడ్‌ చేసి 50 డివిజన్లలో 42 చోట్ల గెలిపించడంతో కార్పొరేషన్‌ను టీడీపీ కైవసం చేసుకుంది. ఆయన చనిపోవడంతో బుజ్జి తమ్ముడు బడేటి చంటికి కార్పొరేషన్‌ బాధ్యతలు అప్పగించింది పార్టీ అధిష్టానం. కానీ‌ చంటి పార్టీని బలోపేతం చేయడంలో వెనుకబడ్డారు.ఏలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల నాని మంత్రి కూడా కావడంతో ఏలూరు వైసీపీలో బలమైన లీడర్లతో పాటు కేడర్ కూడా ఉంది. కానీ..టీడీపీని లీడ్ చేసేవాళ్లు లేక ఆ పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబు కూడా ఎక్కడా కనిపించడం లేదు. అసలు పార్టీలో ఉన్నాడో లేడో కూడా కార్యకర్తలకు తెలియడం లేదు. అధికారం ఉన్నప్పుడు అన్ని పదవులు అనుభవించిన నేతలు ప్రతిపక్షంలోకి వచ్చాక పోరాడటానికి ముందుకు రావడం లేదు. ఇక్కడ నాయకత్వ లోపాన్ని గుర్తించి సరిచేయాల్సిన పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఏలూరుపై పెద్దగా ఫోకస్ పెట్టలేదు.పశ్చిమ గోదావరి జిల్లా అంటే టీడీపీకి కంచుకోట. కానీ ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికల వేళ ఉనికి కాపాడుకోవడానికే కష్టపడాల్సి వస్తుంది.మరోవైపు అధికార పార్టీ మేయర్ ఎన్నికకు కావాల్సిన కార్పొరేటర్లను ఏకగ్రీవం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. మంత్రి ఆళ్ల నాని స్పెషల్ ఫోకస్ పెట్టడంతో ఎక్కడా నాయకుల మధ్య విభేదాలు లేకుండా, రెబల్స్ తలనొప్పులు లేకుండా పరిస్థితులు చక్కబెడుతున్నారు. టీడీపీ, జనసేన శ్రేణులు పెద్దఎత్తున ఆళ్ల నాని సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు.మొత్తమ్మీద వైసీపీ పక్కా వ్యూహంతో ఏలూరు కార్పొరేషన్‌ను కైవసం చేసుకోవడానికి దూకుడుగా వెళ్తోంది. కానీ ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన టీడీపీ పది డివిజన్లు అయినా గెలిచి పరువు నిలబెట్టుకుంటుందా అన్న చర్చ ఇప్పుడు తెలుగు తమ్ముళ్లలో దడ పుట్టిస్తుంది.
ఎంపీ, ఎమ్మెల్యే  మధ్య వార్
సార్వత్రిక ఎన్నికలై గెలిచింది మొదలు గోదావరిజిల్లాలోని ఎంపీ,ఎమ్మెల్యే ఆధిపత్యపోరు అధికార పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఎడ్డెమంటే..ఈయన తెడ్డెమంటున్నారు. పల్లెపోరులో ఇలాగే పోటీలు పడి ఇద్దరు నేతలు రెబల్స్ ని రంగంలో దింపారు. చివరికి అసలు అభ్యర్ధుల కంటే కొసరు అభ్యర్దులు ఎక్కువ స్థానాల్లో గెలిచారు. ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఆ ఎఫెక్ట్ కనిపిస్తోందట.పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో మొదటి నుంచి అధికారపార్టీ‌ అంతర్గత విబేధాలతో కొట్టుమిట్టాడుతోంది. ఏలూరు ఎంపీ కోటగరి శ్రీధర్, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాలకు అస్సలు పడటం లేదు. కార్యకర్తలు సైతం రెండు వర్గాలుగా విడిపోయారు. పంచాయతీ ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపించింది. చాలా పంచాయతీలలో ఎమ్మెల్యే ఒకరికి, ఎంపీ మరొకరికి మద్దతిచ్చారు. ఆవిధంగా పది మంది రెబల్స్‌ గెలిచారు. ఇప్పుడు ఇద్దరి మధ్య పోరుకు మున్సిపల్‌ ఎన్నికలు వేదిక అవుతున్నాయి. మున్సిపాలిటీలో పట్టు సాధించేందుకు రెండు వర్గాలు పావులు కదుపుతున్నారు.గత ఏడాది మున్సిపల్ నోటిఫికేషన్‌ ఇచ్చిన సమయంలో ఎంపీ శ్రీధర్‌, ఎమ్మెల్యే ఎలీజా ఇద్దరు కలిసి ఒక అభ్యర్థిని ఛైర్మన్‌గా ప్రకటించారు. సదరు అభ్యర్థి ఎంపీ అనుచరుడిగా చెబుతారు. ప్రస్తుతం ఎంపీ, ఎమ్మెల్యేకు పడటం లేదు. ఆ కారణంగా మున్సిపల్‌ ఛైర్మన్‌ అభ్యర్థిని మార్చే యోచనలో ఎమ్మెల్యే ఎలీజా ఉన్నట్టు తెలుస్తోంది. అధికారపార్టీలో దీని పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అదే నిజమైతే గ్రూపు పాలిటిక్స్‌ తారాస్థాయికి వెళ్లినట్టేనని పార్టీ కేడర్‌ ఆందోళన చెందుతోందట. ఎమ్మెల్యే ప్రతిపాదించిన వ్యక్తిని ఛైర్మన్‌ను చేస్తారా లేక ఎంపీ అనుచరుడికి ఆ పదవి దక్కుతుందా అని వైసీపీ శ్రేణులు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి.చింతలపూడిపై కోటగిరి ఫ్యామిలీకి పట్టుఉండటంతో ఎంపీ శ్రీధర్‌, ఎమ్మెల్యే ఎలీజా కలిసి పనిచేసినట్టయితే పంచాయతీలఎన్నికల్లో ఫలితాలు మరోలా ఉండేవని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు మళ్లీ మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇదే ఆదిపత్యపోరు నడుస్తుండటంతో స్థానిక నేతలు పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారట..ఎన్నికలు ముగిసేనాటికి ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Related Posts