ముంబై, మార్చి 3, పదేళ్లలో 44 ఇండియన్ యూనికార్న్‌లు ఏకంగా 106 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 7.73 లక్షల కోట్లు) సంపదను క్రియేట్ చేశాయి. ఏడాదికి 14 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలిచ్చాయి. స్టార్టప్ కంపెనీల వాల్యూయేషన్ బిలియన్ డాలర్లుంటే వాటిని యూనికార్న్‌లుగా పిలుస్తారు. మేక్ మై ట్రిప్, ఇన్‌మొబి, పేటీఎం, బైజూస్, కార్స్24, ఓలా వంటి స్టార్టప్ కంపెనీలు దేశంలో స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను మెరుగుపరిచాయని ఇండియన్ టెక్ యూనికార్న్ రిపోర్ట్ 2020 లో ఓరియోస్ వెంచర్స్ పార్టనర్స్ పేర్కొంది. ఫైనాన్షియల్ పేమెంట్స్ సెక్టార్‌లో ఎక్కువ యూనికార్న్‌లు ఉండగా, రిటైల్, సాఫ్ట్‌వేర్ యాజ్ ఏ సర్వీసెస్(సాస్) సెక్టార్లు రెండో స్థానంలో నిలిచాయని ఈ రిపోర్ట్ తెలిపింది. వీటి తర్వాత లాజిస్టిక్స్, డేటా ఎనలిటిక్స్, ట్రావెల్, ఫుడ్, గేమింగ్ వంటి సెగ్మెంట్ల నుంచి ఎక్కువ యూనికార్న్‌లు డెవలప్ అయ్యాయని తెలిపింది. కిందటేడాది రేజర్‌పే, పైన్‌ల్యాబ్స్, జెరోధా, పోస్ట్‌మ్యాన్ వంటి 12 స్టార్టప్ కంపెనీలు యూనికార్న్‌లుగా మారాయి. ఒక ఏడాదిలో ఇన్ని యూనికార్న్‌లు క్రియేట్ కావడం ఇదే మొదటి సారి. 16 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌తో పేటీఎం నెంబర్ వన్ యూనికార్న్‌గా కొనసాగుతోంది. దీని తర్వాత ఎడ్‌టెక్ స్టార్టప్ కంపెనీ బైజూస్ అత్యంత విలువైన స్టార్టప్‌గా ఉంది.ఇండియన్ స్టార్టప్, ఎకోసిస్టమ్ ఫౌండర్లు, ఉద్యోగులు, ఇన్వెస్టర్లు, ఎకానమీ కోసం భారీ వాల్యూని క్రియేట్ చేసింది. ఈ యూనికార్న్‌లలో టెక్నాలజీ బేస్డ్ కంపెనీలే ఎక్కువగా ఉన్నాయి. 21 వ సెంచరీ స్టార్టప్‌లకు, అంతకు ముందు కాలానికి చెందిన స్టార్టప్‌లకు మధ్య ఇదే అతి పెద్ద తేడా’ అని ఓరియోస్ వెంచర్ పార్టనర్స్ మేనేజింగ్ పార్టనర్ రెహన్ యార్ ఖాన్ అన్నారు. ఓలా, ద్రువ్, ఫార్మ్‌ఈజీ వంటి స్టార్టప్‌లలో ఎర్లీ స్టేజ్‌లోనే ఓరియోస్ పెట్టుబడులు పెట్టింది. రానున్న కొన్నేళ్లలో మరో 3–5 యూనికార్న్‌లలో భాగస్వామ్యం అవుతామని ఈ కంపెనీ చెబుతోంది. ఇండియన్ యూనికార్న్‌లలో 41 శాతం కంపెనీలు బెంగళూరు నుంచే రావడం విశేషం. 34 శాతం కంపెనీలు ఢిల్లీ నుంచి, 14 శాతం కంపెనీలు ముంబై నుంచి ఉన్నాయి. ఈ సక్సెస్‌ఫుల్ స్టార్టప్ కంపెనీల నుంచి బయటకు వచ్చేసిన ఎగ్జిక్యూటివ్‌లు, వారి సెకెండ్ వెంచర్స్‌పై పనిచేస్తున్నారని ఈవై ఇండియా పేర్కొంది. కొంత మంది కొన్ని స్టార్టప్‌లలో ఏంజెల్ ఇన్వెస్టర్లుగా ఉన్నారని తెలిపింది. వీరి అనుభవంతో స్టార్టప్ ఎకోసిస్టమ్ మరింతగా ఎదుగుతుందని అభిప్రాయపడింది. దేశంలో టెక్నాలజీ వాడకం పెరగడం వంటి కారణాల వలన టెక్నాలజీ స్టార్టప్ ఎకోసిస్టమ్ మరింత వృద్ధి చెందుతుందని తెలిపింది. డిజిటైజేషన్ వేగంగా విస్తరించడంలో స్టార్టప్‌లు కీలకంగా ఉన్నాయని ఈవై ఇండియా పార్టనర్ అంకుర్ పహ్వా అన్నారు. ఈ ఏడాది ఐపీఓకి రావాలని చాలా స్టార్టప్‌లు ప్లాన్స్ వేసుకుంటున్నాయి. వీటి లాభాలు మెరుగుపడడంతో పాటు, బిజినెస్‌ను విస్తరిస్తుండడంతో స్టాక్ మార్కెట్లో కూడా ఎంటర్ కావాలని చూస్తున్నాయి. యూనికార్న్‌లలో మేక్ మై ట్రిప్, జస్ట్‌డయల్, నౌకరి డాట్ కామ్‌లు ఇప్పటికే మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. ఫుడ్ డెలివరీ స్టార్టప్ జొమాటో, లాజిస్టిక్స్ కంపెనీ డెల్హివరీ, వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్, ఈ–టైలర్ నైకాలు ఈ ఏడాదే ఐపీఓకి రానున్నాయి. ఈ–కామర్స్ స్టార్టప్‌లు కూడా మార్కెట్లో(ఇండియా లేదా విదేశాల్లో) లిస్టింగ్ అవ్వాలని చూస్తున్నాయని పహ్వా పేర్కొన్నారు. రానున్న 12–24 నెలల్లో దీనికి సంబంధించి మరింత న్యూస్ బయటకు వస్తుందని తెలిపారు. ఒక స్టార్టప్ కంపెనీ యూనికార్న్‌గా మారడానికి యావరేజ్‌గా 8 ఏళ్లు పడుతోంది. గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్లు అందుబాటులో ఉండడం, క్యాపిటల్‌ను సంపాదించుకోవడం ఈజీ అవ్వడంతో ఈ టైమ్ తగ్గుతోందని ఈ రిపోర్ట్ పేర్కొంది. నౌకరీ డాట్ కామ్, మేక్ మై ట్రిప్‌లు 2005 లో ప్రారంభమయ్యాయి. ఈ కంపెనీలు యూనికార్న్‌లుగా మారడానికి 14 ఏళ్లు పట్టింది. జొమాటో, ఫ్లిప్‌కార్ట్, పాలసీ బజార్ వంటి స్టార్టప్‌లకు 8.7 ఏళ్లు పట్టగా, నైకా, ఓయో లు 5.8 ఏళ్లల్లోనే యూనికార్న్‌లుగా మారాయి. ఉడాన్, ఓలా ఎలక్ట్రిక్ కంపెనీలయితే కేవలం మూడేళ్లల్లోనే బిలియన్ డాలర్ల కంపెనీలుగా ఎదిగాయి. ఈ ఏడాది కనీసం 12 స్టార్టప్‌లు యూనికార్న్‌లుగా మారతాయని నాస్కామ్ అంచనా వేయడం విశేషం