YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

గులాబీ పార్టీపై వ్యతిరేకత ఉందా

గులాబీ పార్టీపై వ్యతిరేకత ఉందా

హైదరాబాద్, మార్చి 4, 
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వ్యతిరేకత పెరిగిందన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుంది. తెలంగాణకు ముఖ్యమంత్రి గా బాధ్యతలను చేపట్టి దాదాపు ఏడేళ్లు కావస్తుంది. మొదటి దఫాలో ఎప్పుడూ కేసీఆర్ ఇంతటి వ్యతిరేకతను ఎదుర్కొనలేదు. కానీ రెండో సారి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ప్రజల్లో అసంతృప్తి బాగా పెరిగిందన్నది అందరి మాట. అయితే అసంతృప్తి ఏ స్థాయిలో ఉందన్నది సాగర్ ఉప ఎన్నికల్లో బయటపడుతుందన్న అంచనా ఉంది.ఇప్పుడు సెంటిమెంట్ లేదు. ఆంధ్రావాళ్ల ఊసు లేదు. ఉన్నదల్లా ఒక్కటే. బంగారు తెలంగాణ. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తొలి ఐదేళ్లలో ఆయన పెద్దగా ప్రజల్లోకి రాకపోయినా ఆయన పథకాలతో జనం మనసుల్లోకి వెళ్లిపోయారు. అందుకే ఆ సమయంలో జరిగిన ప్రతి ఎన్నికలోనూ జనం ఆయనకే జై కొట్టారు. రైతులకోసం రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలతో పాటు మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, కంటి వెలుగు ఇలా అనేక పథకాలతో ఆయన ప్రజలకు చేరువయ్యారు.అయితే రెండోదఫా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అవే పథకాలను కొనసాగిస్తున్నప్పటికీ ప్రజల్లో సంతృప్తి కనపడటం లేదు. బలమైన నాయకత్వం ఉన్న చోట మాత్రమే పార్టీ ఉంది. అది లేని చోట మరింత బలహీనంగా మారిందనే చెప్పాలి. దుబ్బాక వంటి నియోజకవర్గంలో బలమైన నాయకత్వం, ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ ఓటమి పాలయ్యారు. సంక్షేమ పథకాలు ఇక్కడ పనిచేయలేదంటే కేసీఆర్ చరిష్మా కనుమరుగయిందనే కామెంట్స్ విపక్షాల నుంచి విన్పిస్తున్నాయి.కానీ ఇప్పుడు నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో దీనిపై పూర్తి క్లారిటీ వస్తుంది. కేసీఆర్ పై ఇంకా ప్రజలు నమ్ముతున్నారంటే సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచి తీరాలి. అందుకోసమే టీఆర్ఎస్ నేతలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. చివరి నిమిషం వరకూ అభ్యర్థిని ప్రకటించకుండా సర్వేల మీద సర్వేలు చేయిస్తుంది అందుకేనట. ఇక్కడ గెలిచి తన చరిష్మా ఇసుమంత కూడా తగ్గలేదని కేసీఆర్ నిరూపించుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. మొత్తం మీద సాగర్ ఉప ఎన్నిక ఫలితాలపైనే కేసీఆర్ ఇమేజ్ ఆధారపడి ఉంది.

Related Posts