YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విదేశీయం

బర్మాలో మళ్లీ రక్తసిక్తం

బర్మాలో మళ్లీ రక్తసిక్తం

న్యూఢిల్లీ, మార్చి 4, 
మియన్మార్‌లో సైన్యం జరిపిన కాల్పుల్లో పౌరులు పిట్టల్లా రాలుతున్నారు. ఇప్పటివరకు 30 మంది మరణించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గట్లేదు. తమ అమ్మ ఎక్కడ అంటూ సైన్యాన్ని నిలదీస్తున్నారు.బర్మా అట్టుడుకుతోంది. సైనిక పాలనకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. నిరసనకారులపై సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. ఆందోళనకారులను అణచివేయడానికి సైన్యం జరిపిన కాల్పుల్లో 9 మంది మృతి చెందారు. మియన్మార్‌లో తిరిగి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని ఓ వైపు ప్రపంచ దేశాలు సూచిస్తుండగా.. పాలనను తమ చేతుల్లోకి తీసుకున్న అక్కడి సైనిక ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తోంది.మియన్మార్‌లో రెండో అతిపెద్ద నగరం మండలయ్‌లో సైనికులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతి చెందారు. యాంగాన్‌లో సైన్యం జరిపిన కాల్పుల్లో మరో యువకుడు మృతి చెందినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.మియన్మార్ సెంట్రల్ టౌన్‌లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు పౌరులు దుర్మరణం పాలయ్యారని గెజిట్ కథనంలో పేర్కొన్నారు. మింగ్యాన్ నగరం నడిబొడ్డున జరిగిన కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించాడని విద్యార్థి నేత మో మింట్ హూన్ (25) తెలిపారు.‘శాంతియుతంగా నిరసన చేస్తున్న తమపై సైన్యం బుల్లెట్ల వర్షం కురిపించింది. ఈ కాల్పుల్లో యాంగ్ అక్కడికక్కడే మృతి చెందాడు’ అని మో మింట్ హూన్ తెలిపారు. ఆ కాల్పుల్లో తన కాలికి కూడా గాయమైనట్లు చెప్పారు. పోలీసుల కాల్పుల్లో అనేక మంది గాయపడినట్లు తెలుస్తోంది.మియన్మార్‌లో సైనిక పాలన అమల్లోకి వచ్చిన నాటి నుంచి జరిగిన ఘటనల్లో మొత్తం 30 మంది పౌరులు బలైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. కాల్పులను కూడా లెక్కచేయకుండా జనం పెద్ద ఎత్తున రోడ్లపైకి వస్తున్నారు. అమ్మ ఎక్కడ అని ప్రశ్నిస్తారు. అమ్మ లాంటి ఆంగ్‌ సాన్ సూచీకి ఏదైనా జరిగితే తమ భవిష్యత్తు ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.మియన్మార్‌లో పరిపాలనను సైన్యం తన అదుపులోకి తీసుకుంది. ప్రభుత్వాధినేత ఆంగ్‌సాన్ సూచీని గృహ నిర్బంధంలో ఉంచింది. ఆమె ఎక్కడ ఉన్నారనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. దీంతో జనం ఆందోళనకు చెందుతున్నారు. ఏడాది పాటు అత్యవసర పరిస్థితి కొనసాగుతుందని సైనిక నాయకత్వం ప్రకటించింది. నాటి నుంచి అక్కడ ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి త్వరగా తెలియడంలేదు.గత ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ఆంగ్‌ సాన్‌ సూచీ నేతృత్వంలోని నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమొక్రసీ (ఎన్‌ఎల్‌డీ) ప్రభుత్వాన్ని సైనిక నాయకత్వం అంగీకరించడంలేదు. గత ఎన్నికల్లో అనేక అక్రమాలు జరిగాయన్నది సైన్యం, ప్రతిపక్షాల ఆరోపణ. అయితే ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని ఆ దేశ ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది.ప్రతిపక్షపార్టీ మద్దతున్న సైనిక నాయకత్వం దేశంలో మరోసారి ఎన్నికలు జరగాలని కోరుతోంది. కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం పార్లమెంటు సమావేశాలు ప్రారంభించే ముందుగానే సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన అనేక నియమాలను సూచీ పాటించలేదని, చట్ట విరుద్ధంగా ఆమె కొన్ని సమాచార సాధనాలు వాడుతున్నారని సైన్యం ఆరోపిస్తోంది. సూచీతో పాటు అనేక మంది పార్లమెంటు సభ్యులను కూడా నిర్బంధంలో ఉంచింది.

Related Posts