న్యూఢిల్లీ మార్చ్ 4
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల్లో అశ్లీల చిత్రాలను కూడా చూపిస్తున్నారని ఇవాళ సుప్రీంకోర్టు పేర్కొన్నది. అమెజాన్ ఇండియా హెడ్ అపర్ణా పురోహిత్ వేసిన పిటిషన్‌ను ఇశాళ సుప్రీంకోర్టు విచారించింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల్లో ప్రసారం అవుతున్న వీడియోలను స్క్రీనింగ్ చేయాల్సి అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కొన్ని ప్లాట్‌ఫామ్స్‌లో పోర్న్ వీడియోలను కూడా ప్రసారం చేస్తున్నారని కోర్టు చెప్పింది. అలాంటి ప్రోగ్రామ్‌లను అడ్డుకునేందుకు ఒక విధానం అవసరమని కోర్టు పేర్కొన్నది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నియంత్రించేందుకు తీసుకున్న చర్యలను వెల్లడించాలంటూ కేంద్రానికి సుప్రీం నోటీసులు ఇచ్చింది. ఇంటర్నెట్‌లో సినిమాలను, ఓటీటీలను చూడడం కామన్ అయ్యిందని, ఆ ప్లాట్‌ఫామ్‌లను స్క్రీనింగ్ చేయాలని జస్టిస్ అశోక్ భూషణ్ తన తీర్పులో పేర్కొన్నారు. కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు పోర్న్ సంబంధిత అంశాలను ప్రసారం చేస్తున్నాయని, వాటిని నియంత్రించాలని జస్టిస్ ఆర్ఎస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం రోజు తమ బెంచ్ ముందు సోషల్ మీడియా నియమావళికి సంబంధించిన కొత్త రూల్స్‌ను సమర్పించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు ఆదేశించారు. తాండవ్ వెబ్‌సిరీస్‌లో హిందూ దేవుళ్లను అనుచిత రీతిలో ప్రసారం చేసిన నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ ఎగ్జిక్యూటివ్‌పై యూపీ ప్రభుత్వం కేసు బుక్ చేసింది. హిందువుల మనోభావాలను తాండవ్ సిరీస్ కించపరిచినట్లు ఆరోపణలు వచ్చాయి.