అనంతపురం, మార్చి 5,
కరవు జిల్లాగా పేరొందిన అనంతపురంలో పండించే అరటికి విదేశాల్లో భలే గిరాకీ లభిస్తోంది. జిల్లాలో వర్షాధార భూములు అధికంగా ఉండి అత్యధిక శాతం మంది రైతులు వేరుశెనగ పంటపైనే ఆధారపడేవారు. అయితే అదే సమయంలో ఉద్యానవన పంటలు కూడా అధికంగా సాగులో ఉన్నాయి. బోరుబావుల్లో నీళ్లుండి ఉద్యానవన పంటలు పండించే రైతన్నల ఇంట సిరులు కురుస్తున్నాయి. జిల్లాలో అరటి, రేగు, నిమ్మ, చీనీ, ద్రాక్ష, జామ, మామిడి, బొప్పాయి, దానిమ్మ, సపోట, కర్బూజ తదితర పంటలు, 4 రకాల సుగంధద్రవ్యాల పంటలు, అశ్వగంధ, అలోవేరా తదితరాలు మొత్తం లక్షా 78 వేల హెక్టార్లలో సాగులో ఉన్నాయి. వాటిలో లక్షా 37 వేల హెక్టార్లలో పండ్లతోటలు ఉండటం గమనార్హం. వీటిని సాగుచేస్తున్న రైతన్నలు ప్రతి ఏటా రూ.6226 కోట్ల ఆదాయాన్ని అర్జిస్తున్నట్లు ఉద్యానశాఖ గణాంకాలు చెబుతున్నాయి. కాగా వీటిలో అరటి, దానిమ్మ పంటలు విదేశాలకు ఎగుమతి చేస్తుండడం గమనార్హం. జిల్లాలోని తాడిపత్రి, యల్లనూరు, పుట్లూరు, తాడిమర్రి, నార్పల, శింగనమల, యాడికి తదితర మండలాల్లో అధికంగా అరటి పంట సాగులో ఉంది. ఐన్‌ఐ, ఫ్యూచర్ గ్రూప్స్ కంపెనీలకు చెందిన వారు అరటి సాగయ్యే ప్రారంభ దశనుంచి జిల్లాలో మకాం వేసి నాణ్యమైన అరటి ఏ తోటల్లో వస్తుందోనని పర్యవేక్షణ జరిపి ఉద్యానశాఖ అధికారుల సహకారం మేరకు రైతుల నుంచే నేరుగా కొనుగోలు చేస్తున్నారు. అనంతరం వాటిని యుఏఈ, సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్ తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. గత ఏడాది జిల్లానుంచి అరటి, దానిమ్మ పంటలను కలిపి సుమారు 2,200 మెట్రిక్‌టన్నుల పండ్లు విదేశాలకు ఎగుమతి చేశారు. అదేవిధంగా ఈ ఏడాది కూడా సుమారు 10 వేల మెట్రిక్ టన్నుల అరటి ఎగుమతి చేయడానికి ఇప్పటికే జిల్లా ఉద్యానశాఖ అధికారులతో కలిసి ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా జిల్లాలోని పుట్లూరు మండలం సంజీవపురం, కడవకల్లు గ్రామాల పరిధిలో సుమారు 47 మంది రైతులు సాగుచేసిన అరటిలో నాణ్యత అధికంగా ఉండటంతో దాన్ని ఐన్‌ఐ కంపెనీవారు ఇప్పటికే కొనుగోలు చేసి కోతలు ప్రారంభించారు. రైతుల తోటలోనే రెండు నీటి తొట్టెలు ఏర్పాటు చేసి అందులో బావిస్టీన్ పౌడర్ కలిపి అక్కడే అరటిని శుద్ధిచేసిన అనంతరం విదేశాలకు తరలించడానికి ప్యాకింగ్ చేస్తున్నారు. అరటి సాగుకు రైతుకు ఎకరాకు సుమారు రూ. 2 లక్షల వరకు ఖర్చు వస్తోంది. పంట దిగుబడి వచ్చిన అనంతరం టన్ను రూ. 13 వేల నుంచి రూ. 16,500 వరకు పంటనాణ్యత, మార్కెట్ ధరను బట్టి వస్తోంది. దీంతో పంటసాగుకు చేసిన ఖర్చు పోనూ రైతుకు ఎకరాకు రూ. 2 నుంచి రూ. 3 లక్షల వరకు ఆదాయం సమకూరుతోంది. కరవు నేలగా పేరొందిన అనంతపురం జిల్లాలో వ్యవసాయం చేయడం పట్ల రైతన్నల శ్రమ విలువకట్టలేనిదని, నీటి వనరులు అందుబాటులో ఉంటే జిల్లా రైతాంగం వాణిజ్యపంటలు పండించి సిరిసంపదలతో తూగుతుందని అరటి కొనుగోలు చేస్తున్న ఐన్‌ఐగ్రూప్ సంస్థవారు అభినందిస్తున్నారు.