ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా? రాష్ట్రంలో మళ్లీ వలసలు ఊపందుకోబోతున్నాయా? పరిణామాలు చూస్తే అలాగే కనిపిస్తున్నాయి. బీజేపీకి చెందిన ముఖ్య నేతలు వైసీపీగూటికి చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అనుచరులు, సన్నిహితులతో మంతనాలు జరిపిన నేతలు... త్వరలోనే వైసీపీ కండువా కప్పుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ లిస్ట్‌లో కన్నా లక్ష్మీనారాయణ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కృష్ణా జిల్లా ఉంగటూరు దగ్గర జగన్ సమక్షంలో పార్టీలో చేరబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఆయన కాని, అనుచరులు కాని ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక కర్నూలు జిల్లాకు చెందిన కాటసాని రాంభూపాల్‌రెడ్డి కూడా వైసీపీలో చేరేందుకు దాదాపు నిర్ణయం తీసుకున్నారట. ఇప్పటికే అనుచరులతో సమావేశమైన ఆయన... పార్టీ మార్పుపై ఇప్పటికే సంకేతాలు ఇచ్చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే చేరికకు ముహూర్తం మాత్రం నిర్ణయించుకోలేదట. కన్నా, కాటసానితో పాటూ కేంద్ర మాజీమంత్రి కావూరి సాంబశివరావు పేరు కూడా వినిపిస్తోంది. ఆయన కూడా వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. వీరితో పాటూ మరికొందరు రాష్ట్రస్థాయి చిన్నా, చితకా నేతలు కూడా వైసీపీలో చేరే ఆలోచనలో ఉన్నారట. వీరంతా పార్టీని వీడితే... ఏపీలో బలపడాలనుకుంటున్న బీజేపీకి పెద్ద ఎదురు దెబ్బేనని చెప్పాలి.