YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

సైబర్ నేరాలపై దృష్టి

సైబర్ నేరాలపై దృష్టి

మెదక్, మార్చి 5, 
ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ప్రపంచంలో ఏ మూలనుంచైనా నయా తరహా సైబర్‌ మోసాలకు కేటుగాళ్లు తెగబడుతున్నారు. రోజురోజుకూ సైబర్‌ నేరాల సంఖ్య పెరుగుతున్నది. వీరిని గుర్తించడం పోలీసులకు సవాల్‌గా మారుతున్నది. ఈ తరుణంలో తెలంగాణ పోలీసు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. సైబర్‌ మాయగాళ్లకు ముకుతాడు వేసేందుకు దేశంలోనే తొలిసారి సైబర్‌ వారియర్స్‌ను ఏర్పాటు చేసింది. అన్ని పోలీసుస్టేషన్లలో సైబర్‌ క్రైమ్‌ యూనిట్లు నెలకొల్పాలని సంకల్పించి, కార్యాచరణను ఇటీవల షురూ చేసింది. అందులో భాగంగానే సిద్దిపేట పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 25 పోలీసు స్టేషన్లలో ఈ విధానాన్ని అమలు పర్చనున్నారు. ఆధునిక టెక్నాలజీలో ఆన్‌లైన్‌లో శిక్షణ ఇచ్చేందుకు టెక్నాలజీ పై పట్టు ఉన్న వారికి శిక్షణ ఇస్తున్నది.మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ వాడకం పెరిగింది. అంతే వేగంగా సైబర్‌ నేరాలు సంఖ్యా పెరుగుతున్నది. చదువు రాని వారితో పాటు వెల్‌ ఎడ్యుకేటెడ్‌ వరకూ సైబర్‌ మాయగాళ్లు బురిడీ కొట్టిస్తూ ఖాతాలోని డబ్బులు కొల్లగొడుతున్నారు. వీరికి చెక్‌ పెట్టేందుకు సైబర్‌ నేరాల నియంత్రణకు తెలంగాణ పోలీసు ఒక అడుగు ముందుకేసి సైబర్‌ వారియర్స్‌ను ఏర్పాటు చేసింది.సైబర్‌ నేరాల నియంత్రణకు పోలీసులు కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. ఆధునిక టెక్నాలజీపై పూర్తిస్థాయి పట్టు ఉన్న పోలీసులను శిక్షణకు ఎంపిక చేసింది. సిద్దిపేట కమిషనరేట్‌లో 25 పోలీసు స్టేషన్లు ఉండగా, ప్రతి పోలీసు స్టేషన్‌లో సైబర్‌ క్రైమ్‌ యూనిట్‌ నెలకొల్పుతుంది. ఇందుకు గానూ పోలీసుస్టేషన్‌కు ఇద్దరు చొప్పున వారం రోజుల పాటు ప్రతి రోజు 3 గంటలు ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తుంది. ఇప్పటికే శిక్షణ ప్రారంభమైంది. శిక్షణలో భాగంగా నేరం ఎలా జరుగుతున్నది? అన్న దగ్గరి నుంచి దానిని ఏ మూల నుంచి ఎవరు చేస్తున్నారు?.. వారిని గుర్తించేలా పోలీసులకు శిక్షణ ఇస్తున్నారు. సైబర్‌ నేరాల గుట్టు విప్పేందుకు పోలీసులకు సుమారు 16అంశాలపై ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తున్నారు. కంప్యూటర్‌ వైరస్‌, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ, సైబర్‌ సెక్యూరిటీ, చాలెంజెస్‌, రిస్క్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, నేషనల్‌ సైబర్‌ సెక్యూరిటీ, పాలసీ యాక్టు, కమ్యూనికేషన్‌ వ్యవస్థ, ఇంటర్‌నెట్‌ డేటా సెంటర్‌, నెట్‌వర్కింగ్‌ వ్యవస్థ, నేషనల్‌ నాలెడ్జ్‌ నెట్‌వర్క్‌, ఇన్ఫర్‌మేషన్‌ అడిటింగ్‌ కంప్లయింట్స్‌, ఐవోటీ, క్లిష్టమైన వెబ్‌ అప్లికేషన్స్‌, సెక్యూరిటీ, సోషల్‌మీడియా ఈ-గవర్నెన్స్‌, ఇన్సిడెంట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ఇలాంటి వాటిపై ప్రత్యేక శిక్షణ పోలీసులు పొందుతున్నారు.పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్లలో త్వరలో సైబర్‌ క్రైమ్‌ యూనిట్స్‌ అందుబాటులోకి రానున్నాయి. సైబర్‌ నేరం నమోదైన వెంటనే ప్రపంచంలో ఏ మూల నుంచి పాల్పడ్డారో గుర్తించడం, సైబర్‌ కేసుల్లో పూర్తిస్థాయిలో ఆధారాలు సేకరించడం, నేరానికి పాల్పడిన వారికి శిక్షలు పడేలా చేయడం, బాధితులకు న్యాయం చేయడంతో పాటు సైబర్‌ నేరాలకు ముకుతాడు వేసేలా సైబర్‌ క్రైమ్‌ యూనిట్స్‌ పని చేస్తాయి.

Related Posts