YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

మార్కెట్ కు పోటెత్తున్న మిర్చి

మార్కెట్ కు పోటెత్తున్న మిర్చి

వరంగల్, మార్చి 5, 
వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌ మిర్చి పోటెత్తింది.  40వేల బస్తాలు రాగా బుధవారం అంతకుమించి పంట మార్కెట్‌కు వచ్చింది. అయితే, మధ్యలో తగ్గుముఖం పట్టిన ధరలు క్రమేణా పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా దేశీయ మిర్చికి రికార్డుస్థాయిలో క్వింటాలుకు రూ.25వేల ధర పలికింది. తేజా, వండర్‌హాట్‌, దీపికా, యూఎస్‌-341 విత్తన పంట ధరలు సైతం పెరుగుతున్నాయి. దాంతో కొద్ది రోజులుగా నిల్వ చేసిన మిర్చి రైతులు విక్రయించేందుకు మార్కెట్‌కు తరలిస్తున్నారు.  వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో 80వేల ఎకరాలకు పైగా మిర్చి సాగవుతోంది. ఎనుమాముల మార్కెట్‌లో కొనుగోళ్లు ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటివరకు 2.20 లక్షల క్వింటాళ్ల మిర్చి వచ్చింది. గత నెల మొదటి వారంలో ధరలు ఆశాజనకంగా ఉన్నా క్రమేణా తగ్గడంతో రైతులు బెంబేలెత్తారు. ధరలు పడిపోవడంతో దాదాపు 50 వేల క్వింటాళ్లు రైతులు కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ చేశారు. ఉన్నట్టుండి ఫిబ్రవరి చివరి వారం నుంచి కొద్దికొద్దిగా ధరలు పెరుగుతున్నాయి. ఎనుమాముల మార్కెట్‌కు ఖమ్మం పరిసర ప్రాంతాలతోపాటు ఏటూరునాగారం, మంగపేట, వెంకటాపురం, నర్సంపేట తదితర ప్రాంతాల నుంచి అధికంగా మిర్చి వస్తుంది. బుధవారం ఒక్క రోజే 40వేల బస్తాలకు పైగా మిర్చీ రాగా రికార్డు స్థాయిలో రూ.25వేలు ధర పలికింది. ఇందులో దేశీయ మిర్చి 500 బస్తాలు రాగా కనిష్ట ధర రూ. 19వేలు, గరిష్ట ధర రూ. 25వేలు పలికింది. ఇక తేజారకం 10వేల బస్తాలు రాగా కనిష్టం రూ.9,500, గరిష్ట ధర రూ.14,400 పలికింది. వండర్‌హాట్‌ 8వేల బస్తాలు రాగా కనిష్ట ధర రూ.10వేలు కాగా గరిష్ట ధర రూ.16వేలు. యూఎస్‌ 341 రకం మిర్చి 12వేల బస్తాలు రాగా కనిష్ట ధర రూ.9,500, గరిష్ట ధర రూ.15,200 పలికింది. దీపికా రకం 200 బస్తాలు రాగా కనిష్ట ధర రూ.10వేలు, గరిష్ట ధర రూ.17వేలు పలికింది. 2వ తేదీతో పోల్చితే 3వ తేదీ ధరలు స్వల్పంగా పెరడంతో ఎనుమాముల మార్కెట్‌కు మిర్చి పోటెత్తుతోంది. మంగళ, బుధవారాల్లోనే అధికంగా మిర్చి రావడంతో యార్డు పూర్తిగా నిండిపోయింది. వ్యాపారులు సైతం అధికంగానే వచ్చి కొనుగోళ్లు జరుపుతున్నారు. వేసవి కూడా ప్రారంభం కావడంతో అర్ధరాత్రి నుంచే మిర్చి మార్కెట్‌కు వస్తోంది. ఉదయాన్నే కొనుగోళ్లు ప్రారంభించి మధ్యాహ్నం వరకే కొనుగోళ్లతోపాటు మార్కెట్‌ నుంచి బస్తాల్ని తరలిస్తున్నారు.జిల్లాలో అత్యధికంగా తేజా రకం మిర్చి సాగవుతోంది. గతంలో దీనికి రూ.18వేలకు పైగా ధర పలకగా, క్రమేణా రూ.12 వేలకు పైగా పడిపోంది. ఇప్పుడు కొద్దికొద్దిగా పెరుగుతూ ఈ నెల 1వ తేదీన రూ.13,600 పలుకగా 2న రూ.14,350, 3న రూ.14,400 లకు చేరింది. అత్యధికంగా సాగయ్యే మిర్చికి ధరలు లేకపోవడంతో రైతులు కొంత నిరాశతో ఉన్నారు. అయితే, తేజా, యూఎస్‌ 341, దీపికా, వండల్‌హాట్‌ తదితర రకం మిర్చికి సైతం ధర పెరగాల్సిన అవసరం ఉందంటున్నారు రైతులు.

Related Posts