YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

బిక్కుబిక్కు మంటున్న భగీరధ

బిక్కుబిక్కు మంటున్న భగీరధ

హైదరాబాద్, మార్చి 5, 
అపర భగీరథ' ప్రయత్నం బెడిసికొట్టినట్లే ఉన్నది. వేలకోట్లు అప్పులు తెచ్చి ఆర్భాటం చేసినా, ఇప్పటికీ పనులు ఓ కొలిక్కి రాలేదు. నిర్ణీత సమయంలో పనులు పూర్తిచేయలేకపోవడంతో డీపీఆర్‌ అంచనాలను మించి ఖర్చూ పెరుగుతున్నది. తీసుకున్న అప్పులను వడ్డీలతో సహా తిరిగి చెల్లించే గడువు దగ్గర పడింది. వాటిని ఎలా తీర్చాలి? మిషన్‌ భగీరథ కార్పొరేషన్‌ ఉన్నతాధికారుల ఆర్థిక తర్జనభర్జన ఇది. 2016, ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. 2045 సంవత్సరం వరకు తాగునీటి అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టును డిజైన్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగం సంస్థ వ్యాప్కోస్‌తో కలిసి సంయుక్తంగా రూ. 42,853 కోట్లతో డీపీఆర్‌ తయారు చేశారు. దానికోసం కేంద్రప్రభుత్వ ఆర్థిక సంస్థలైన హడ్కో, నాబార్డ్‌తోపాటు 16 వాణిజ్య బ్యాంకుల నుంచి రుణాలను తీసుకున్నారు. 2018 మే నెలలో ఈ ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అసెంబ్లీలో ప్రకటించారు. కానీ అది సాధ్యం కాలేదు. వివిధ కారణాలతో పనులు నత్తనడక నడిచాయి. ఇప్పటివరకు రూ.38వేల కోట్లు ఖర్చు చేశారు. రాష్ట్రంలోని 26 సెగ్మెంట్లల్లోని 26 వేల హ్యాబిటేషన్లకు మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటిని ఉచితంగా అందించాలనేది ప్రభుత్వ ప్రణాళిక. వాటర్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్లు, మెయిన్‌ పైపులైన్లు, ఇన్‌టేక్‌ వెల్స్‌, భారీ ట్యాంకులు, ఇతర పనులు పూర్తిచేయగలిగారు. తాగునీటిని ఇంటింటికీ పంపిణీ చేసే వ్యవస్థ(ఇంట్రా విలేజ్‌ నెట్‌వెర్క్‌) పనులు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పనులు 'త్వరలో' పూర్తవుతాయనే మాట అధికారులు తరచుగా వల్లె వేస్తున్నారు. అంచనా వ్యయం పెరగడంతో కొత్తగా అప్పులు తేవాలన్నా, ప్రభుత్వ గ్యారంటీ అవసరమని అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే తొలి విడత నుంచి తీసుకున్న అప్పులను వడ్డీతో సహా నెలవారీ వాయిదాలు చెల్లించాల్సిన గడువు వచ్చేసింది. దీనితో ఏటా రూ.4,800 కోట్లను కేవలం వడ్డీలుగానే ఆర్థికసంస్థలకు చెల్లిస్తున్నారు. సర్కారు నుంచి రుణాల కోసం ఇచ్చిన మ్యాచింగ్‌ గ్రాంట్‌ తప్ప ప్రత్యేక కేటాయింపులు లేకపోవడంతో ఇప్పుడవి తడిసి మోపెడయ్యాయి. బ్యాంకు రుణాల చెల్లింపుల కోసం ఇతరత్రా అప్పుల చెల్లింపుల్ని వాయిదా వేస్తున్నారు. దానిలో భాగంగానే రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ విద్యుత్‌ పంపిణీ సంస్థలకు (డిస్కంలు) భారీగా కరెంటు చార్జీల చెల్లింపులను నిలిపివేశారు. రెండేండ్లుగా కరెంటు చార్జీలు కట్టట్లేదు. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌కు రూ.వెయ్యి కోట్లు, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌కు రూ.1,300 కోట్లు...మొత్తంగా రూ.2,300 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ సొమ్ము సకాలంలో రాకపోవడంతో డిస్కంలు ఆర్థికంగా కుంగిపోతున్నాయి. కరెంటు చార్జీల బకాయిల కోసం కార్పొరేషన్‌కు డిస్కంల అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. ఉన్నతస్థాయి అధికారులతో చర్చలు జరిపారు. 2017 నుంచి పేరుకుపోయిన ఈ బకాయిల్లో ఎట్టకేలకు టీఎస్‌ఎస్పీడీసీఎల్‌కు రూ. 200 కోట్లు, ఎన్పీడీసీఎల్‌కు రూ.170 కోట్లు మాత్రమే చెల్లించినట్టు అధికారులు తెలిపారు. మిగిలిన బకాయిల చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు.అప్పుల కోసమే తెలంగాణ డ్రింకింగ్‌ వాటర్‌ సప్లరు కార్పొరేషన్‌ (టీడీడబ్ల్యూఎస్‌సీఎల్‌)ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇప్పుడు దానినుంచి ఆదాయాన్ని రాబట్టడంపై దృష్టిపెట్టింది. భగీరథ నీటికి యూజర్‌ ఛార్జీలు వసూలు చేసే సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. అయితే ఎప్పటి నుంచి దీన్ని అమల్లోకి తేవాలనే దానిపై తర్జనభర్జనలు నడుస్తున్నాయి. ఆదాయం కోసం కార్పొరేషన్‌ ద్వారా వాటర్‌బాటిళ్లను మార్కెట్లోకి తేవాలని నిర్ణయించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ తరహా ప్రయోగాన్ని హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ వర్క్స్‌ చేపట్టింది. దానికోసం గండిపేట వద్ద ఫిల్టర్‌ బెడ్స్‌ను కూడా ఏర్పాటు చేశారు. 20 లీటర్లు, లీటర్‌, అర లీటర్‌ బాటిళ్ల తయారీకి ఏర్పాట్లు చేశారు. అయితే ప్రయివేటు కార్పొరేట్‌ నీటి వ్యాపార కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గి, అప్పట్లో దీన్ని అర్థంతరంగా నిలిపివేశారు. ఈ అనుభవం దృష్ట్యా మిషన్‌ భగీరథ లేబుల్‌ను మార్కెట్లోకి విడుదల చేసి, కార్పొరేట్‌ కంపెనీలకే ఆ బాధ్యతలు అప్పగించి, రాయల్టీని పొందాలనే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు సమాచారం. భగీరథ మంచినీటి బాటిళ్లను ప్రభుత్వ శాఖలకే సరఫరా చేసేలా కార్పొరేట్‌ కంపెనీలతో ఒప్పందం చేసుకొని, ఆ మేరకే రాయల్టీ ధరను నిర్ణయించనున్నట్టు సమాచారం. అయితే భగీరథ అధికారులు మాత్రం వాటర్‌ బాటిళ్లను భగీరథ తాగునీటిని ప్రజలు విస్త్రృతంగా వినియోగించేలా ప్రొత్సహించేందుకు మాత్రమే తెస్తున్నట్టు చెబుతుండటం గమనార్హం.

Related Posts