విజయవాడ, మార్చి 6,
పంచాయతీల పంచాయతీ పూర్తయ్యింది.. ఫలితాలు అధికార వైసీపీకి అనుకూలంగా వచ్చాయి. ఇప్పుడు పట్టణాలు, నగరాల్లో ఓటరు తీర్పు ఎలా ఉండబోతోంది ? అన్నదానిపై ఇప్పుడు అందరి ఆసక్తి నెలకొంది. ఏ పార్టీకి ఆ పార్టీ తమకు అనుకూలంగా సర్వే లెక్కల్లో మునిగి తేలుతోంది. ఇప్పటికే కొన్ని ప్రీ పోల్ సర్వేలు బయటకు వస్తున్నాయి. ఏపీలో ఎన్నికలు జరిగే 12 కార్పొరేషన్లలో రాజకీయ వర్గాల అంచనా ప్రకారం 3-4 నుంచి నాలుగు కార్పొరేషన్లలో టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య హోరాహోరీ ఫైట్ నడుస్తోంది. మిగిలిన కార్పొరేషన్లలో వైసీపీ ఆధిక్యంలో ఉంది. వైసీపీ ఆధిక్యంలో ఉన్న మూడు కార్పొరేషన్లలో సైతం టీడీపీ కష్టపడితే గెలిచే లేదా ఆధిక్యంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. కొన్ని చోట్ల జనసేన + బీజేపీ కూటమి కూడా నిర్ణయాత్మక శక్తిగా మారే ఛాన్సులు ఉన్నాయి.కార్పొరేషన్ల వారిగా అంచనాలు పరిశీలిస్తే తిరుపతిలో 50 డివిజన్లకు వైసీపీ 30 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది. ఇక్కడ టీడీపీ సింగిల్ డిజిట్ దాటే పరిస్థితి లేకపోగా.. జనసేన 2-4 డివిజన్లలో ప్రభావం చూపనుంది. సీఎం జగన్ సొంత ఇలాకా అయిన కడపలో 50 డివిజన్లకు వైసీపీ 45 డివిజన్లలో పాగా వేసి తిరుగులేకుండా కార్పొరేషన్‌పై పార్టీ జెండా సగర్వంగా ఎగరవేస్తుంటే టీడీపీ కేవలం 3-5 డివిజన్లతో మాత్రమే సరిపెట్టుకోనుందట. ఇక సీమ ముఖద్వారం అయిన కర్నూలు కార్పొరేషన్లో 50 డివిజన్లకు వైసీపీ ఖాతాలో 40 డివిజన్లు పడుతుంటే…. టీడీపీకి వచ్చే డివిజన్లు సింగిల్ డిజిట్ దాటవనే అంటున్నారు.పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో 50 డివిజన్లకు 25 వైసీపీ, 15 టీడీపీ గెలుచుకునే ఛాన్సులు ఉంటే.. జనసేనకు 5 స్థానాలు రానున్నాయి. మరో 10 డివిజన్లలో టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య హోరా హోరీ పోరు సాగనుంది. ఇక్కడ టీడీపీ వైసీపీని ఎదుర్కొని నిలబడితే గెలుపు ఎవరికి వచ్చినా ఏకపక్షం అయితే ఉండదు. ఇక చిత్తూరు కార్పొరేషన్ లో వార్ వైసీపీకి వన్‌సైడ్ కానుంది. 50 డివిజన్లకు వైసీపీకి 40, టీడీపీకి 7, జనసేనకు 3 వస్తాయని అంచనా వేస్తున్నారు.సమాచార శాఖా మంత్రి పేర్ని నాని ఇలాకా అయిన మచిలీపట్నం కార్పొరేషన్‌గా మారాక జరుగుతోన్న తొలి ఎన్నికలు ఇవే. ఇక్కడ 50 చిన్న డివిజన్లు ఉన్నాయి. 32 చోట్ల వైసీపీ.. 9 డివిజన్లలో టీడీపీ, జనసేన 5 చోట్ల గెలుస్తుందని లెక్కలు వేస్తున్నారు. విజయనగరానికి కూడా ఇవే తొలి కార్పొరేషన్ ఎన్నికలు ఇక్కడ 50 డివిజన్లకు వైసీపీ 21, టీడీపీ 18 చోట్ల గెలిస్తే జనసేనకు 3 చోట్ల ఛాన్స్ ఉందంటున్నారు. అయితే 12 డివిజన్లో టీడీపీ, వైసీపీ మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఎవరు గెలిస్తే వారికే మేయర్ పీఠం దక్కనుంది. అనంతపురం కార్పొరేషన్‌కు కూడా ఇవే తొలి ఎన్నికలు. ఇక్కడ 50 డివిజన్లకు 32 చోట్ల వైసీపీ, 8 చోట్ల టీడీపీ, 10 చోట్ల హోరా హోరీ ఉండబోతోందట. మంత్రి బాలినేని నియోజకవర్గం ఒంగోలులో 50 డివిజన్లకు 36 చోట్ల వైసీపీ, 8 చోట్ల టీడీపీ గెలిస్తే… 6 చోట్ల హోరా హోరీ ఉండనుంది. దీనిని బట్టి ఒంగోలులో పెద్ద పోటీయే ఉండదని తెలుస్తోంది.రాజధాని ప్రాంతమైన అమరావతిలో ఉన్న విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలో గుంటూరు కన్నా విజయవాడలోనే టీడీపీకి ఎక్కువ ఎడ్జ్ కనిపిస్తోంది.గుంటూరులో 57 డివిజన్లకు 25 వరకు వైసీపీ, టీడీపీ 15 స్థానాలు గెలిస్తే… 4 చోట్ల జనసేన గెలిచే అవకాశం ఉంది. మరో 13 చోట్ల టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య టఫ్ ఫైట్ ఉంది. ఇక ఏపీలో టీడీపీకి బాగా ఎడ్జ్ ఉన్న కార్పొరేషన్లలో విజయవాడ ఫస్ట్ ప్లేసులో ఉంది. ఇక్కడ 64 డివిజన్లకు 30 వరకు టీడీపీ ఖాతాలో పడే అవకాశాలున్నాయి. వైసీపీ 22 చోట్ల జనసేనకు 4 చోట్ల ఛాన్స్ ఉంది. 10 స్థానాల్లో హోరీహోరీ ఎవరిని గట్టెక్కిస్తుందో ? చూడాలి. అన్ని కార్పొరేషన్ల కన్నా ఎక్కువ ఆసక్తి రేపుతోన్న విశాఖ కార్పొరేషన్లో మొత్తం 98 డివిజన్లు ఉన్నాయి. 41 స్థానాల్లో వైసీపీ, 28 చోట్ల టీడీపీ, 9 చోట్ల జనసేనకు ఛాన్సులు ఉన్నాయంటున్నారు. 18 స్థానాల్లో టీడీపీ, వైసీపీ మధ్య జరిగే టఫ్ ఫైట్ మేయర్ పీఠం ఎవరిదో డిసైడ్ చేయనుంది.