తిరుపతి, మార్చి 6,
సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత జరిగే ఒకే ఒక ఉప ఎన్నిక. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో ఉప ఎన్నిక రావడంతో అన్ని పార్టీలకూ ఇది ప్రతిష్టాత్మకంగా మారిందనే చెప్పాలి. పంచాయతీ ఎన్నికలలో అత్యధిక స్థానాలను విజయం సాధించిన అధికార పార్టీ తిరుపతి ఉప ఎన్నికలో కూడా సునాయాసంగానే విజయం సాధిస్తామని గట్టిగా నమ్ముతుంది. పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు కొంత వరకూ వైసీపీ అసమ్మతిని, అసంతృప్తిని తగ్గిస్తాయని చెప్పాలి.తిరుపతి ఉప ఎన్నికలో కూడా వైసీపీ గెలిస్తే ఇక వాయిస్ పెంచే నేత ఇప్పట్లో ఉండరన్నది వాస్తవం. గత రెండేళ్ల నుంచి జగన్ సంక్షేమ కార్యక్రమాలపైనే దృష్టి పెట్టారు. అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేసినా పంచాయతీ ఎన్నికల్లో జనం జగన్ కే జై కొట్టారు. అయితే గత కొంతకాలంగా జగన్ పై సీనియర్ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ లైన్ దాటి వారు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీని ఇబ్బందికరంగా మార్చాయనే చెప్పాలి. ప్రధానంగా మాజీ మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, ధర్మాన ప్రసాదరావులు గత కొంతకాలంగా అసంతృప్తిలో ఉన్నారు. మంత్రి పదవులు తొలి దఫాలోనే దక్కకపోవడంతో వీరు బాహాటంగానే వ్యాఖ్యానాలు చేస్తున్నారు. నేరుగా జగన్ పై విమర్శలు చేయకపోయినా వారి ప్రాంతాల్లో సమస్యలను, మంత్రులను టార్గెట్ చేశారు. ఆనం రామానారాయణరెడ్డికి ఒకదశలో షోకాజ్ నోటీసు కూడా ఇవ్వాలనుకున్నారు. కానీ ఆయన జగన్ ను కలవడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు.ఇక ధర్మానప్రసాదరావు సయితం అసంతృప్తిలోనే ఉన్నారు. ఆయన పెద్దగా పార్టీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేయకపోయినా పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు. మంత్రి వర్గ విస్తరణ దగ్గరపడుతున్న వేళ పంచాయతీ ఎన్నికలు జగన్ కు అనుకూలంగా మార్చాయని చెప్పవచ్చు. ఈ ఫలితాలతో జగన్ కు జనాదరణ చెక్కుచెదరలేదన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతుంది. అందుకే జగన్ ఇక బిందాస్ గా తాను అనుకున్న వారికి మంత్రిపదవులు ఇవ్వవచ్చు. పార్టీకి వ్యతిరేకంగా ఇక వాయిస్ వినిపించకపోవచ్చు.