
మంగళవారం మార్కెట్లు కూడా లాభాలతోనే ముగిశాయి. సెన్సెక్స్ 165.87(0.48%) పాయింట్ల లాభంతో 34,616.64 వద్ద ముగియగా, నిఫ్టీ 29.65 (0.28%) పాయింట్లు బలపడి 10,614.35 వద్ద స్థిరపడింది. ఉదయం సెన్సెక్స్ 101 పాయింట్లకు పైగా లాభంతో 34,552.40 పాయింట్ల వద్ద ప్రారంభమైంది, మరోవైపు నిఫ్టీ 14 పాయింట్ల లాభంతో 10600 పాయింట్ల వద్ద మొదలైంది. ఆరంభం నుంచి స్వల్ప ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ చివరికి సూచీలు లాభాల బాటలోనే పయనించాయి. ఐటీ, మెటల్ స్టాక్స్ 2 శాతం నష్లాలను చవిచూశాయి. ఐసీఐసీఐ బ్యాంకు అత్యధికంగా 29.75 పాయింట్లు లాభపడింది. సోమవారం 388.40 వద్ద ముగిసిన షేర్ విలువ 7.66 % పెరుగుదలను నమోదుచేసి 418.15 వద్ద స్ధిరపడింది. మరోవైపు హిండాల్కో షేరు అత్యధిక నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. నిన్నటి రోజున 255.60 వద్ద ముగియగా మంగళవారం 18.85 పాయింట్లు కోల్పోయి 7.37 శాతం నష్టంతో 236.75 వద్ద నిలిచింది. రిలయెన్స్, బజాజ్ ఆటో, యస్ బ్యాంకు, హెచ్‌యూఎల్, లాభపడగా, విప్రో, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టెక్‌మహీంద్రా, భారతీ ఇన్‌ఫ్రాటెల్, హిండాల్కో, వేదాంత, ఇతర సంస్థలు షేర్లు నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ సూచీలు లాభాలతో ముగియడం విశేషం.