YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

కోర్టుకు విశాఖ నిర్వాసితులు

కోర్టుకు విశాఖ నిర్వాసితులు

విశాఖపట్టణం, మార్చి 6, 
కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ప్రైవేటీకరణ మీద మోజుతో ముందుకు సాగిపోతోంది. కేంద్ర ప్రభుత్వం కేవలం పర్యవేక్షణకే పరిమితం కావాలి తప్ప కర్మాగారాలు పెట్టి వ్యాపారాలు చేయరాదు అన్న ఉద్దేశ్యంలో ఉన్నట్లుగా బీజేపీ నాయకులు ఈ మధ్య చాలా గొప్పగా చెబుతున్నారు. తాజాగా జరిగిన నీతి అయోగ్ సమావేశంలో కూడా ప్రధాని మోడీ దేశానికి ప్రైవేటీకరణ ఆవశ్యకతను చాటి చెప్పారు. ఇదిలా ఉంటే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడానికి కేంద్రం పూర్తిగా సిద్ధంగా ఉందనే సంకేతాలు వస్తున్న తరుణంలో యాభై ఏళ్ల క్రితం స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన రైతు కుటుంబాల వారసులు సరైన షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.కేంద్రం వ్యాపారం చేయనంటోంది. కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో ఉంచను అంటోంది. అలాంటపుడు మా భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా చేస్తారంటూ రైతులు గట్టిగానే గర్జిస్తున్నారు. 1960 దశకం చివరలో విశాఖ ఒక మాదిరి పట్టణంగా ఉండేది. ఇక ఇప్పటి స్టీల్ ప్లాంట్ కూడా పల్లెటూరు పరిసరాల్లో ఏర్పాటు చేశారు. నాడు దాదాపుగా 17 వేల మంది రైతులు 22 వేల ఎకరాల దాకా భూములు ఇచ్చారు. అది కూడా నామమాత్రం ధరకే కేంద్రానికి ఇచ్చారు. నాటి విశాఖ జిల్లా కలెక్టర్ అర్జునరావు నచ్చ చెప్పి భూములను సేకరించారు. రైతులు భూములు ఇస్తే ఆర్ధికంగా విశాఖ బాగుపడుతుంది, ఉద్యోగ అవకాశాలు అందరికీ వస్తాయని కూడా నచ్చచెప్పారు.అయితే రైతుల భూములను తీసుకున్న పాలకులు ఇప్పటికీ అందరికీ నష్టపరిహారం ఇవ్వలేకపోయారు. దీని మీద హై కోర్టు, సుప్రీం కోర్టులు రైతులకు అనుకూలంగా తీర్పు చెప్పినా కూడా వారికి న్యాయం జరగలేదు. అదే విధంగా చాలా మందికి ఉద్యోగాలు కూడా రాలేదు. అయితే స్టీల్ ప్లాంట్ కోసం వినియోగించిన భూములు వదిలేయగా గంగరవరం పోర్టుకు ఇక్కడ నుంచే రెండు వేల ఎకరాలను తరువాత రోజులలో ఇవ్వడాన్ని కూడా రైతులు తప్పుపట్టారు. ఇప్పటికీ స్టీల్ ప్లాంట్ మిగులు భూమి ఏడు వేల ఎకరాల దాకా ఉంది. ఆ భూములను తెగనమ్ముకోవడానికే ప్రభుత్వం ప్రైవేటీకరణ మంత్రం వల్లిస్తోందని రైతులు అంటున్నారు. అందువల్ల ఆ భూములు మావి, స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం నడపనపుడు మా భూములు మాకు ఇచ్చేయండి అంటూ రైతులు గట్టిగా కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఉక్కు ఆందోళనలో ఇపుడు ఇదే అంశం హైలైట్ అవుతోంది.విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఉన్న ఏడు వేల ఎకరాలు ఇప్పటి మార్కెట్ ధరకు లెక్క కడితే 70 వేల కోట్ల రూపాయలు అవుతుంది. ఇంత పెద్ద ఎత్తున ఆదాయం వచ్చే ఈ భూములను తమకు కావాల్సిన వారికి కట్టబెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికే కేంద్రం చూస్తోంది అంటూ రైతులు మండిపడుతున్నారు. ఈ భూములను వెనక్కి ఇస్తే తమ బతుకులు తాము బతుకుతామని కూడా చెబుతున్నారు. మరో వైపు మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ దీని మీద జగన్ కూడా గట్టిగా పోరాడాలని కోరడం విశేషం. ఈ భూములను తెగనమ్మాలని చూస్తే విశాఖలో మరో ఆందోళన కూడా వస్తుందని ఆయన హెచ్చరిస్తున్నారు. మొత్తానికి భూములను చూస్తే విశాఖ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్నారు అన్న వార్తలు కనుక నిజమైతే మాత్రం దానికి సరైన కౌంటర్ రైతుల నుంచి పడిందని అంటున్నారు.

Related Posts