విశాఖపట్టణం, మార్చి 6,
మఠాలూ, స్వాములు ఉన్నది ఐహిక జీవితాన్ని త్యజించి. మోక్ష మార్గానికి దారులు చూపడానికి. అయితే నవీన కాలంలో స్వాముల తీరు మారుతోంది. జనాల ఆశలు కూడా పెరుగుతున్నాయి. ముందు భౌతిక జీవితం సాఫీగా సాగడానికి మార్గం చూపమని జనాలు కోరుతున్నారు. అదే సమయంలో స్వాములు కూడా వారు కోరినట్లుగానే తమ జపతపాలను కూడా ఇందుకోసమే వెచ్చిస్తున్నారు. భారతీయ జీవన విధానం చూస్తే ఒకప్పుడు రాజుల వెంట రాజ గురువులు ఉండేవారు. ఏది మంచి చెడ్డ అన్న దాని మీద మారదర్శకత్వం వహించేవారు. ఆధునిక కాలంలో రాజకీయ నాయకులలో చాలా మంది ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు.ఇక ఉత్తర భారత దేశంలో మఠాలూ పీఠాలకూ రాజకీయ జీవులకు ఉన్న అనుబంధం వేరేగా చెప్పనవసరం లేదు. కానీ దక్షిణాదిన మాత్రం ఇది కొంత వరకూ తక్కువే. అయితే దైవ భక్తి విశ్వాసాలు కలిగిన పాలకులు మొదటి నుంచి తెలుగు రాజకీయాల్లో కనిపిస్తారు. అహం బ్రహ్మస్మి అని ఎన్టీయార్ తనకు తానే ఒక దైవాంశ సంభూతునిగా చెప్పుకునే వారు. ఆయన ఉన్నట్లుండి కాషాంబరధారిగా కనిపించి నాటి తెలుగు వారిని ఆశ్చర్యచకితులను చేశారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డికి కూడా స్వాముల పట్ల కొంత భక్తి ఉండేదని చెబుతారు.విశాఖ శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర మహా స్వామి మొదటి నుంచి రాజకీయ నేతలను కూడా తన శిష్యులుగా చేసుకుని వారిని ఆశీర్వదిస్తూంటారు. ఆయన ఆశ్రమానికి పెద్ద సంఖ్యలోనే రాజకీయ పార్టీల నేతలు తరచుగా వస్తారు. ఇక వర్తమానంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ కూడా ఆయన అంటే అమితమైన భక్తి ప్రపత్తులు కనబరుస్తారు. కేసీయార్ ఏకంగా రాజశ్యామలా యాగాన్ని నిర్వహించి రెండవ సారి అధికారంలోకి వచ్చారు. ఇక జగన్ కోసం కూడా స్వామీజీ రాజశ్యామలా యాగాన్ని తన ఆశ్రమంలో నిర్వహించారని చెబుతారు. మొత్తానికి రెండు సార్లు నిర్వహించిన ఈ యాగం వల్ల రెండు తెలుగు రాష్ట్రాలో కేసీయార్, జగన్ అధికారంలోకి రావడం మాత్రం విశేషం పరిణామమే.రాజ్యశ్యామల యాగం చాలా శక్తివంతమైనది అని స్వరూపానందేంద్ర స్వామీజీ అంటున్నారు. తాజాగా శారదాపీఠం వార్షికోత్సవాల సందర్భంగా మరో మారు నిర్వహించిన రాజశ్యామల యాగానికి ముఖ్యమంత్రి జగన్ హాజరై స్వామీజీ దీవెలను అందుకున్నారు. ఈ యాగం రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలన్న కోరికతో నిర్వహించినట్లుగా స్వరూపానందేంద్ర స్వామీజీ పేర్కొన్నారు. రాజశ్యామలా యాగాలను గతంలో నిర్వహించడం వల్ల తెలుగు రాజకీయాల్లో మార్పు కూడా వచ్చిందని పేర్కొన్న ఆయన కేసీయార్, జగన్ ముఖ్యమంత్రులు కావడాన్ని గుర్తు చేశారు. మొత్తానికి రాజశ్యామల యాగం తో రాజగురువుగా స్వరూపానందేంద్ర స్వామి అవతరించారని చెప్పవచ్చు. అంతే కాదు, రాజకీయ నాయకులకు కూడా రాజశ్యామల అమ్మ వారి మీద మరింతగా గురి కుదిరింది అని కూడా అంటున్నారు.