హైదరాబాద్, మార్చి 6,
తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చాయి విద్యుత్ సంస్థలు. 2015, 2017 లలో ఇచ్చిన పదోన్నతులు విద్యుత్ సంస్థలు రద్దు చేయనున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే జెన్ కో లో 8 మంది చీఫ్ ఇంజనీర్స్ కు ఎస్ఈలుగా రివర్షన్ చేసినట్లు చెబుతున్నారు. ఈ మేరకు జెన్ కో యాజమాన్యం పాత తేదీతో ఉత్తర్వులు ఇచ్చినట్లు సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పదోన్నతులు పొందిన ఇతరులకు సైతం డిమోషన్ లు ఇస్తారని చెబుతున్నారు.మొత్తం దాదాపు 1150 మంది ఇంజినీర్లు, అధికారులకు రివెర్షన్లు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ధర్మాధికారి కమిటీ తుది నివేదిక, సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు యాజమాన్యాలు చర్యలు తీసుకుంటున్న క్రమంలోనే ఈ రివెర్షన్లు అని అంటన్నారు. ఏపీ నుంచి వచ్చిన ఉద్యోగులు, స్థానిక ఉద్యోగులతో కొత్త సీనియారిటీ జాబితాలు తయారు చేసి మళ్ళీ పదోన్నతులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఏపీ నుంచి సీనియర్ అధికారులు అధిక సంఖ్యలో రావడంతో ఉన్నత పదవులు వారికే దక్కే అవకాశం కనిపిస్తోంది.