YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పెద్దన్న పాత్ర కోసం పవన్

పెద్దన్న పాత్ర కోసం పవన్

విజయవాడ, మార్చి 8, 
సినిమాల్లో అన్నయ్య, పెద్దన్నయ్య పాత్రలకు పవన్ కల్యాణ్ చాలా చేశారు. కానీ రాజకీయాలకు వచ్చేసరికి మాత్రం ఆయన ఇంకా తమ్ముడి పాత్రలే వేస్తున్నారు. ఆ పార్టీతో జట్టు కట్టి ఈ పార్టీతో పొత్తు పెట్టుకుని పవన్ రాజకీయాల్లో తడబాట్లు పొరపాట్లు చేస్తున్నారు అంటున్నారు. పవన్ కల్యాణ్ ఏ పార్టీతో పొత్తు కుదుర్చుకున్న కూడా లీడ్ చేసే చాన్స్ మాత్రం దక్కడంలేదు. దీంతో తమ హీరో పాలిటిక్స్ లో కూడా బాగా వెలగాలని ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు.ఇపుడు పవన్ కల్యాణ్ కి ఒక్కటే టార్గెట్ ఉంది. వైసీపీ, టీడీపీ బలమైన పార్టీలు, ఏపీలో వాటికి పెద్ద ఎత్తున ఓటు బ్యాంక్ ఉంది. వాటిని ఢీ కొట్టడం కంటే కూడా ముందు బీజేపీ జనసేన కూటమిలో తనదే పైచేయి అని చాటి చెప్పుకోవడానికే ఆయన అధిక ప్రాధ్యాన్యత ఇస్తున్నారు అంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ కంటే కూడా ఎక్కువ సంఖ్యలో జనసేన సర్పంచ్ పదవులు గెలుచుకుంది. ఆ పార్టీ మద్దతుదారులు బాగానే దూసుకెళ్ళారు. దాంతో పవన్ కల్యాణ్ బీజేపీ కంటే తమ పార్టీయే ఎక్కువ అని చూపుతున్నారు.బీజేపీ మిత్ర ధర్మం పాటించడంలేదని జనసైనికులు వాపోతున్నారు అంటే అర్ధముందిగా. దేశంలో బీజేపీ పెద్ద పార్టీ కావచ్చు, కేంద్రంలో అధికారంలో ఉండవచ్చు. కానీ ఏపీకి వచ్చేసరికి మాత్రం బీజేపీ నోటా కంటే తక్కువ ఓట్లున్న పార్టీగానే చూస్తున్నారు. ఇక పంచాయతీ ఎన్నికల్లో కూడా బీజేపీ మద్దతుదారులు పెద్దగా గెలిచిన దాఖలాలు కనిపించలేదు. అదే సమయంలో గోదావరి జిల్లాలో జనసేన కొంతలో కొంత ఉనికి చాటుకుంది. ఈ పరిణామాల నేపధ్యంలో ఏపీలో కూటమికి సారధ్యం వహించే బాధ్యతను తమ పార్టీకే ఇవ్వాలన్న వాదన జనసేన నుంచి వినిపిస్తోందిట.
ఏపీలో ఎన్డీయే కూటమికి పవన్ కల్యాణ్ నాయకత్వం వహించడం ధర్మం అని రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు. బీజేపీ గతంలో టీడీపీ చంద్రబాబు నాయకత్వంలో పనిచేసిన సంగతిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ మాత్రం ఏం తక్కువ. ఆయన రాజకీయంగా కూడా బాగానే రాటుదేలారని, పైగా అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు శాతం ఓట్లు జనసేనకు వచ్చాయని అంటున్నారు. తాజాగా పంచాయతీ ఎన్నికల్లో కూడా జనసేన తన పరిధి మేరకు రాణించిన సంగతినీ పేర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో బీజేపీ భేషజాలకు పోకుండా కూటమి నాయకత్వం పవన్ కల్యాణ్ చేతిలో పెట్టి ఆయన్ని భావి ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేస్తేనే మేలు జరుగుతుంది అన్న మాట కూడా ఉంది. పవన్ కూడా ఇదే జరగాలని కోరుకుంటున్నారుట. కానీ ప్రాంతీయ పార్టీలను తన గుప్పిట్లో పెట్టుకుని ఆడించే బీజేపీకి ఇది మింగుడుపడుతుందా అన్నదే పెద్ద డౌట్.

Related Posts