తిరుపతి, మార్చి 8,
చంద్రబాబునాయుడు తరచూ అనే మాట ఏంటి అంటే తన రాజకీయ జీవితంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను కానీ జగన్ లాంటి సీఎం ని ఎక్కడా ఎప్పుడూ అసలు చూడలేదని. చెప్పాలంటే ఇది పచ్చి నిజం. చంద్రబాబు 1978 నుంచి ఎమ్మెల్యేగా మంత్రిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. ఆయన చెన్నారెడ్డి, అంజయ్య, విజయభాస్కరరెడ్డి, భవనం వెంకటరాం, నేదురుమల్లి జనార్ధనరెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి వంటి సీఎంలను చూశారు. వారితో ఆయన కలసి పనిచేశారు. అయినా చంద్రబాబుకు జగన్ లాంటి సీఎం ఎక్కడా టచ్ కాలేదు. అంటే చంద్రబాబు టోటల్ పాలిటిక్స్ కే ఇదొక కొత్త అనుభవం అన్న మాట.పైన చెప్పుకున్న ముఖ్యమంత్రులు అంతా కూడా ఒక రకమైన వైఖరితో ఉన్న వారు. వారికీ చంద్రబాబుకు రాజకీయ పరమైన విభేదాలే ఉన్నాయి. కొందరితో అయితే వ్యక్తిగతంగా మంచి రిలేషన్స్ కూడా చంద్రబాబుకు ఉన్నాయి. కానీ జగన్ తో అలా కాదు. వైఎస్సార్ తో ఉన్న విభేదాలు కూడా జగన్ తో కంటిన్యూ అవుతున్నాయి. దానికి వడ్డీ అన్నట్లుగా జగన్ ని పదహారు నెలల పాటు కాంగ్రెస్ తో కలసి చంద్రబాబు కుట్ర పన్ని జైలుకు పంపించారు అన్నది కూడా ఉంది. దాంతో ఇక్కడ జగన్ని బాబు ఏ మాత్రం వదలలేదు, కాబట్టి జగన్ ఇపుడు తన పవర్ ఏంటో చూపించి తాను కూడా వదలదలచుకోలేదు అని అంటారు.ఏపీలో వైసీపీకి వేవ్ ఉంది. అది పంచాయతీ ఎన్నికలతో రుజువు అయింది. అది చాలు జగన్ మరింత దూసుకుపోవడానికి. అదే సమయంలో చంద్రబాబును తొలి రెండేళ్ళూ అమరావతి రాజధాని చుట్టూ తిప్పిన జగన్ ఇపుడు కుప్పం కోటను కూల్చేయడం ద్వారా రానున్న కాలమంతా అక్కడికే పరిమితం అయ్యేలా చేశారు అంటున్నారు. ఇంతకాలం చంద్రబాబు మహా నాయకుడిగా వెలుగొందేవారు. తాను ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఒక్క నామినేషన్ వేస్తే చాలు కుప్పం జనాలు భారీ మెజారిటీతో గెలిపించి ఎమ్మెల్యేను చేస్తారు అన్న నమ్మకం ఉండేది. జగన్ పంచాయతీ పుణ్యమాని ఆ నమ్మకం ఇపుడు భారీ ఎత్తున ఓడిపోయింది. దాంతో చంద్రబాబు ఇకపైన ఓ సాధారణ ఎమ్మెల్యే మాదిరిగా కుప్పానికి వరస టూర్లు వేయాల్సిందే.చంద్రబాబు ఫస్ట్ ప్రయారిటీ ఇపుడు కచ్చితంగా కుప్పమే అవుతుంది. కుప్పంలో మళ్ళీ తాను గెలిచి తీరాలి, మంచి మెజారిటీ రావాలి. ఇదే రకమైన ఆలోచనలలో చంద్రబాబు ఉంటే మిగిలిన ఏపీవ్యాప్తంగా ఉన్న పార్టీని ఎవరు చూసుకుంటారు. నాయకుడు అన్న వాడు మొత్తం పార్టీని నడిపించాలి. జనాలను కదిలించాలి. కానీ చంద్రబాబు ఇపుడు కుప్పం వెంట పరుగులు తీస్తే ఆటోమేటిక్ గా రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు ఆలోచించే తీరిక ఓపిక రెండూ తగ్గిపోతాయి. వైసీపీకి కూడా అదే కావాల్సింది. చంద్రబాబును అధినాయకుడి స్థాయి నుంచి ఒక ఎమ్మెల్యే స్థాయికి తగ్గించేయడమే వైసీపీ అక్కడ సాధించిన విజయం. చంద్రబాబు కేవలం తన గెలుపు కోసం పరితపిస్తూ 174 సీట్లను వదిలేస్తే అక్కడ వైసీపీ పంట పండినట్లే. మొతానికి కుప్పం దెబ్బ వైసీపీకి ఇంతలా ప్లస్ అవుతోంది అన్న మాట