YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

స్వరూపకు గ్యాప్ పెరిగినట్టేనా

స్వరూపకు గ్యాప్ పెరిగినట్టేనా

విశాఖపట్టణం, మార్చి 8, 
శాఖపట్నానికి చెందిన శ్రీ శారదాపీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర మహా సరస్వతి కాస్తా భిన్నమైన వారు. ఆయన ఎక్కువగా ప్రచారాన్ని కోరుకుంటారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక విశాఖ స్వామీజీకి రాజకీయ భక్తులు ఎక్కువ. అందునా మొదట్లో కాంగ్రెస్ వారు ఉంటే ఇపుడు వైసీపీ వారు బాగా కనిపిస్తున్నారు. దాంతో ఆయన తెలుగుదేశానికి ప్రత్యర్ధిగా ఉన్నారా అన్న చర్చ మొదటి నుంచి ఉంది. దానికి తగినట్లుగా విశాఖకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు ఆయన మీద విమర్శలు చేయడం కూడా జరుగుతూ వచ్చింది.చంద్రబాబు 2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావడానికి స్వరూపానందేంద్ర స్వామీజీ తన వంతు కృషి చేశారని చెబుతారు. నాడు బ్రాహ్మణ సంఘాలను, ధార్మిక సంస్థలను కూడా తెలుగుదేశం వైపుగా స్వామి నడిపించారని అంటారు. అప్పట్లో జగన్ క్రైస్తవ మతారాధకుడిగా ఉండడంతో హైందవ ధర్మ రక్షణ కోసం టీడీపీకి స్వరూపానందేంద్ర మద్దతు ఇచ్చారని చెబుతారు. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ముహూర్తం మంచిది కాదంటూ అప్పట్లో స్వామి చేసిన కామెంట్ తెలుగుదేశం వర్గాల్లో కాక పుట్టించింది. రాష్ట్రంలో నాడు వరస దుర్ఘటనలు జరిగిన నేపధ్యంలో స్వామి ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. దాంతో చంద్రబాబుతో అలా గ్యాప్ వచ్చిందని అంటారు. ముఖ్యమంత్రి అయ్యాక బాబు తనను పట్టించుకోకపోవడం వల్లనే స్వరూపానందేంద్ర స్వామి ఇలా అన్నారని కూడా ప్రచారంలో ఉంది.ఇక అయిదేళ్ల టీడీపీ ఏలుబడిలో స్వరూపానందేంద్ర స్వామి ఆశ్రమం మీద కూడా నిఘా పెట్టారని, పీఠానికి చెందిన స్థలాన్ని కూడా వివాదంగా చూపే ప్రయత్నం చేశారని ప్రచారంలో ఉంది. దీంతో స్వామి జగన్ వైపు మళ్ళారని అంటారు. ఆ మీదట జగన్ స్వామీజీకి దగ్గర కావడంతో పాటు రాజశ్యామల హోమాన్ని చేయించడం, కనీ వినీ ఎరుగని రీతిన సీట్లు దక్కి జగన్ సీఎం కావడం వంటివి జరిగిపోయాయి. జగన్ పాదయాత్ర దగ్గర నుంచి ఆయన తలపెట్టే ప్రతీ కార్యక్రమానికి స్వరూపానందేంద్ర స్వామి ముహూర్తం పెడతారని కూడా అంటారు. ఇక టీడీపీకి చంద్రబాబుకు కన్నెర్ర కలిగేలా జగన్ పలుమార్లు ఆశ్రమానికి రావడం కూడా ఇపుడు రాజకీయంగా రచ్చకు కారణం అవుతోంది.చంద్రబాబు అన్నారని కాదు కానీ స్వామి రాజకీయ ప్రముఖులతో భేటీలను కొంత తగ్గించాలని ఆస్తిక జనులు కూడా అంటున్నారు. ఇక ఆశ్రమానికి మంచి శక్తి ఉంది. అక్కడ పూజలు బాగా జరుగుతాయి. సాధారణ భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వస్తారు. ఇటువంటి వేళ రాజకీయ దుమారం రేగడం, విమర్శలు రావడం మంచిది కాదు అన్న భావన అయితే సగటు భక్త జనంలో ఉంది. మరో వైపు చూస్తే చంద్రబాబు పీఠాన్ని, స్వరూపానందేంద్ర స్వామీజీని విమర్శించడాన్ని అర్చక సంఘాలు కూడా తప్పు పడుతున్నాయి. చంద్రబాబు అలా అని ఉండకూడదు అన్న మాట కూడా వస్తోంది. ఇవన్నీ కాదు కానీ స్వరూపానందేంద్ర స్వామీజీ కేసీయార్ కి జగన్ కి చేసినట్లుగానే చంద్రబాబు కోసం కూడా రాజశ్యామల హోమం చేయిస్తే బాగుంటుంది కదా. ఏ రాజకీయ వివాదం ఇక పైన రాదు అని మేధావులు సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి స్వామికి చంద్రబాబు బాకీ ఉన్నారా. లేక బాబుకు ఆయన బాకీ ఉన్నారో తెలియదు కానీ పీఠం మీద పసుపు పార్టీ పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది.

Related Posts