హైదరాబాద్, మార్చి 8,
హజ వనరులను ఎంత చక్కగా వాడుకుంటే అంత అద్భుతాలు స్పష్టించవచ్చు. ఆర్థికంగా కూడా మేలే. శేరిలింగంపల్లి జోనల్ అధికారులు ఇదే పని చేశారు. సోలార్ పవర్‌తో రోజు వారీ విద్యుత్ ఖర్చును గణనీయంగా తగ్గించుకున్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా వంద నర్సరీలు నెలకొల్పాలని సంకల్పించగా, అందులో భాగంగా ఒకటి ఐఏఎస్‌కాలనీలో ఏర్పాటైంది. ఇక్కడి మొక్కలకు నీటి అందించేందుకు సౌరశక్తిని ఉపయోగించుకొని.. బల్దియాకు విద్యుత్ వ్యయ్యాన్ని సగానికి సగం తగ్గించగలిగారు. దీనికి తోడు నెలవారీగా వచ్చే బిల్లులకు ఫుల్‌స్టాప్ పెట్టారు. తొలిదశగా చేసిన ఈ ప్రయత్నం.. మిగిలిన నర్సరీల్లోనూ సాధ్యాసాధ్యాలను బట్టి ఇదే తరహా విధానం అవలంబించాలని నిర్ణయించారు. జోన్ పరిధిలోని ఐఏఎస్ కాలనీ నర్సరీలో లక్ష మొక్కలను ఏర్పాటు చేస్తున్నారు. బయోడైవర్సిటీ అధికారిణి నీరజ నేతృత్వంలో ఇందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. అయితే ఈ నర్సరీలో మొక్కలను కాపాడుకునేందుకు అవసరమైన విద్యుత్ వ్యవస్థ కోసం సుమారు రూ. 10 లక్షల వరకు వ్యయం అవుతున్నట్లు అంచనా వేశారు. కిలోమీటర్ దూరం నుంచి సుమారు 25 వరకు స్తంభాలు, తీగలు, ట్రాన్స్‌ఫార్మర్‌తో సహా ఇతర పరికరాలకు ఖర్చు పెట్టడం కన్నా.. సౌరశక్తిని వినియోగించాలని జోనల్ కమిషనర్ సంకల్పించారు. అనుకున్నదే తడువుగా టెండర్ ప్రక్రియను పూర్తి చేయించారు. అలా.. గరిష్ఠంగా కేవలం రూ. 4 లక్షల వ్యయంతో సోలార్ పలకలను, ఇతర సాంకేతిక పరికరాలు నర్సరీలో ఏర్పాటయ్యాయి. సుమారు రూ. 6 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు అధికారులు వ్యయం తగ్గించగలిగారు. అలాగే ఈ నర్సరీకి నెలనెలా వచ్చే విద్యుత్ బిల్లుల సమస్య లేకుండా పోయింది. మూడు కిలో వాట్ల సామర్థ్యం కలిగిన ఈ సోలార్ పవర్‌తో సమీపంలోని ఖాజాగూడ లేక్ నుంచి మొక్కల సంరక్షణకు పూర్తి స్థాయిలో నీటి సరఫరా, నర్సరీ చుట్టూ అందమైన లైటింగ్‌ను సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఈ నర్సరీ స్ఫూర్తిగా మరికొన్ని నర్సరీలకు సైతం సోలార్ పవర్‌ను వినియోగించే ఆలోచనలో అధికారులు ఉన్నారు. కాగా, కరెంటు బిల్లుల భారం లేకుండా సహజ విద్యుత్ వినినియోగానికి శ్రీకారం చుట్టిన ఇక్కడి అధికారులను బల్దియా ఉన్నతాధికారులు సైతం అభినందించారు.