లక్నో మార్చ్ 8
భారత సాంప్రదాయాలకు లౌకికవాద ముప్పు పొంచి ఉందని, ప్రపంచ గుర్తింపునకు అందుకే నోచుకోవడం లేదని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. దీని నుంచి బయటపడటానికి స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఆయన స్పష్టం చేశారు. కంబోడియాలో పర్యటన సందర్భంగా అక్కడి ప్రముఖ ఆంగ్‌కోర్ వాట్ ఆలయాన్ని సందర్శించిన యోగి.. ఆ తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడి ఆలయంలోని ఓ గైడ్‌తో జరిపిన సంభాణ గురించి యోగి చెప్పారు. తనది బౌద్ధ మతం అని అతడు చెప్పాడని, కానీ ఆ బౌద్ధానికి మూలం కూడా హిందూమతమేనని యోగి అన్నారు. కంబోడియాలో ఆ యువకుడికి తనది బౌద్ధ మతమని తెలిసినా దాని మూలాలు కూడా అతనికి తెలుసు. అతను ఆ విషయాన్ని స్వేచ్ఛగా చెప్పాడు. అదే ఇలాంటి విషయాలు ఇండియాలో చెబితే చాలా మంది లౌకికవాదం ప్రమాదంలో పడుతుంది. ఈ లౌకికవాదమనేది భారత ప్రాచీన సాంప్రదాయాలకు పెను ముప్పు. వాటికి ప్రపంచ గుర్తింపు లేకుండా చేస్తోంది అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అసలైన జీవిత పాఠాలను చెప్పేవి రామాయణ, మహాభారతాలేనని ఈ సందర్భంగా యోగి స్పష్టం చేశారు. రామ జన్మభూమి అంశం తెరపైకి వచ్చిన సమయంలోనూ కొందరు చరిత్రకారులు ప్రశ్నలు లేవనెత్తారు. అసలు రాముడు జన్మించిన స్థలం ఇది కాదని అన్నారు. అయోధ్యపై అనుమానాలు కలిగేలా మాట్లాడారు. ఈ మెంటాలిటీయే కొన్ని శతాబ్దాలుగా ఇండియాకు రావాల్సిన పేరును రాకుండా చేశాయి అని యోగి అన్నారు.