న్యూఢిల్లీ, మార్చి 8,
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు భారీ ఊరట కలిగించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. ప్రధాన మంత్రి ఉజ్వల పథకం కింద ఉన్న 8 కోట్ల మంది లబ్ధిదారులకు ఉచిత ఎల్‌పిజి సిలిండర్ల అందించే అవకాశం ఉన్నట్లు నివేదికలు వెలువడుతున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మరో మూడు నెలల పాటు 3 ఉచిత సిలిండర్లు అందించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రపంచ ధరల పెరుగుదల నేపథ్యంలో జనవరి నుంచి 14.2 కిలోల సిలిండర్ ధర జనవరి నుంచి సిలిండర్‌కు 125 రూపాయలకు పైగా పెరిగింది. దీనివల్ల జనవరిలో రూ.694 ఉన్నఎల్‌పిజి సిలిండర్ ధర ప్రస్తుతం రూ.819కు చేరుకుంది. వాస్తవానికి ఢిల్లీలో గత ఏడాది మే నుంచి వంట గ్యాస్ ధర 237.50 రూపాయలు పెరిగింది. గత సంవత్సరం కరోనా మహమ్మారి సమయంలో ప్రధాన్ మంత్రి గారిబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద ఉజ్వల పథకం లబ్ధిదారులందరికీ మూడు నెలల పాటు ఉచిత ఎల్‌పిజి సిలిండర్లు అందించారు. ఎల్‌పిజి సిలిండర్ల రిటైల్ ధరకు సమానమైన నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి మూడు నెలలు బదిలీ చేశారు. 2021-22 బడ్జెట్‌లో రెండేళ్లలో ఉజ్వాలా పథకం కింద 10 మిలియన్ల మంది లబ్ధిదారులు చేరినట్లు ప్రభుత్వం ప్రకటించింది.