విజయవాడ, మార్చి 9,
రాష్ట్రంలో మరో ఎన్నికల పర్వానికి తెరలేచింది. ఇప్పటి వరకు నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో మా మద్దతుదారులే గెలిచారు.. కాదు.. మా మద్దతు దారులే గెలిచారు.. అంటూ.. వైసీపీ, టీడీపీలు జోరుగా ప్రచారం చేసుకున్నాయి. మాటల యుద్ధం చేసుకున్నాయి. అయితే.. ఇక, ఇటీవల మునిసిపాలిటీ.. కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు వచ్చాయి. ప్రస్తుతం ప్రచార జోరు పెరుగుతోంది. నాయకులు భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే పంచాయతీ ఎన్నికలకు పట్టణ ఎన్నికలకు తేడా ఉంది. ఈ ఎన్నికలు పార్టీ సింబల్ మీద జరుగుతాయి. ఎవ్వరూ కూడా ఇక్కడ మరొకరి గెలుపు.. తమ ఖాతాలో వేసుకునే ఛాన్స్ ఉండదు.రాష్ట్రంలోని మొత్తం 12 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతుండగా.. అధికార వైసీపీకి మాత్రం మూడు ఎన్నికలు మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి. ఒక్క అధికార పార్టీకే కాదు.. రాష్ట్ర భవిష్యత్తును కూడా ఈ మూడు ప్రాంతాల్లోని ఎన్నికలు యూటర్న్ తీసుకునేలా చేస్తాయని అంటున్నారు పరిశీలకులు. దీంతో అధికార పార్టీ ఈ మూడు చోట్లా జెండాను రెపరెపలాడించేందుకు ప్రయత్నిస్తోంది. మరి ఆ మూడు చోట్లా జగన్‌కు పరీక్షగా మారుతుందా? లేదా గెలుపు నల్లేరుపై నడకవుతుందా? చూడాలి.
1. గుంటూరు: రాజధాని అమరావతిని కేవలం శాసన రాజధానిగా ఉంచి.. రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని జగన్ సర్కారు ప్రకటించింది. దీనికి వ్యతిరేకంగా 436 రోజులుగా ఇక్కడి రైతులు ఆందోళన బాటపట్టారు. ఇప్పుడు గుంటూరు కార్పొరేషన్‌లో కనుక వైసీపీ గెలిస్తే.. అధికార పార్టీ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి ప్రజలు జై కొట్టారనే సంకేతాలు వస్తాయి. దీంతో వైసీపీ దూకుడుగా ముందుకు వెళ్తుంది. రాజధాని వికేంద్రీకరణ చేసినా జనాల్లో ఇక్కడ వ్యతిరేకత లేదని ఫ్రూవ్ చేసుకోవాలంటే ఇక్కడ పార్టీ గెలవడం జగన్‌కు ప్రతిష్టాత్మకం.
2. విజయవాడ: దాదాపు ఇక్కడ కూడా మూడు రాజధానుల విషయమే చర్చనీయాంశంగా మారింది. గుంటూరు-విజయవాడ జంట నగరాలుగా అభివృద్ధి చేసి.. రాజధానిని ఏర్పాటు చేసినట్టు గతంలో చంద్రబాబు ప్రకటించారు ఇప్పుడు మూడు రాజధానులతో విజయవాడ ప్రభావం తగ్గుతుంది. ఈ నేపథ్యంలో వైసీపీ కనుక ఇక్కడ పాగా వేస్తే.. మూడుకు ప్రజలు జై కొట్టినట్టే. అదే సమయంలో ప్రతిపక్షం చేస్తున్నవాదనను ప్రజలు పక్కన పెట్టారనే అనుకోవాలి. టీడీపీకి చాలా పట్టున్న విజయవాడను గెలుచుకోవడం కూడా జగన్ ముందున్న పెద్ద సవాల్.
3. విశాఖ: ప్రస్తుతం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీ కరించేందుకు కేంద్రం పావులు కదుపుతోంది. ఈ విషయంలో జగన్ ప్రభుత్వం కూడా తెరచాటున ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇక..ఇప్పుడు విశాఖ కార్పొరేషన్‌లో కనుక వైసీపీ గెలిస్తే.. విశాఖ ఉక్కు ప్రైవేటీ కరణ జరగడం ఖాయమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ మూడు చోట్లా గెలుపు వైసీపీ ఇంపార్టెంటుగా మారితే.. రాష్ట్ర ప్రజల భవితవ్యానికి కూడా అంతకు మించి ఇంపార్టెంటుగా మారింది. అలా కాకుండా ప్రతిపక్షం ఇక్కడ గెలుగుపు గుర్రం ఎక్కితే.. వైసీపీ నిర్ణయాలను తిరస్కరించినట్టే భావించాలి. ఈ మూడు నగరాల్లో వైసీపీ జెండా ఎగిరితేనే జగన్ పట్టు నిలుస్తుంది. మరి ఫైనల్ రిజల్ట్ ఎలా ? ఉంటుందో ? చూడాలి.