YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

మంత్రపుష్పం

మంత్రపుష్పం

*కరస్థే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనపతౌ గృహస్థే స్వర్భూజాఽమరసురభిచిన్తామణిగణే ।*
*శిరస్థే శీతాంశౌ చరణయుగలస్థేఽఖిలశుభే*
*కమర్థం దాస్యేఽహం భవతు భవదర్థం మమ మనః ॥*
--- ఆదిశంకరుల శివానందలహరి నుండి...
ఓ గిరీశా! బంగారు కొండ నీ చేతిలో ఉంది. (మేరుపర్వతము త్రిపురాసురసంహారములో శివునికి విల్లయినది). నీ సమీపమునందే ధనాధిపతి కుబేరుడున్నాడు. నీ ఇంటియందే కల్పవృక్షము, కామధేనువు, చింతామణి ఉన్నాయి. నీ శిరస్సునందు చంద్రుడు ఉన్నాడు.  సమస్తశుభములూ నీ పాదయుగళముయందు ఉన్నాయి. నేను నీకు ఏమి ఈయగలను ? నా మనస్సే నీదగుగాక. 
విశ్వoలో వున్నదంతా భగవంతునిదే అయినపుడు మళ్ళీ ఆయనకు ఏదైనా సమర్పించడo ఆయనది ఆయనకే ఇచ్చినట్లు అవుతుంది కదా! కాబట్టి ఇచ్చేదేమిటి? అని తర్కo చేసేవాళ్ళూ వుoటారు. మనo అనుభవించే ఆస్తిపాస్తులు మన తండ్రి తాతలనుండే సంక్రమించాయి.అసలు మనo భూమి మీదకు బ్రతికి బట్ట కట్టడానికి తల్లిదండ్రులు కదా కారణo! అలాంటి మనo, 'నా ఆస్తి 'అని చెప్పుకుoటూ, మన శరీర పోషణ నిమిత్తం వాళ్ళిచ్చిన ఆస్తిపాస్తులను అనుభవిస్తున్నా మన తల్లిదండ్రులు ఏమీ అనుకోరు. పైగా ఏదైనా శుభకార్యం నిర్వహించిన తరువాత తల్లిదండ్రులకు బట్టలు కూడా పెడతాము.వాస్తవానికి తమవల్ల పిల్లలకు సంక్రమించిన ఆస్తిపాస్తులే అయినా, వాళ్ళేదో తమకు బట్టలు పెట్టినట్లు, తల్లిదండ్రులు సంతృప్తి చెందుతారు కాని, తమవే తమకు ఇస్తున్నారని అనుకోరు. అలాగే విశ్వభాగ్యం అంతా భగవoతునికి సంబoధిoచినదే అయినా, ఆయనకు మనo భక్తితో సమర్పిస్తే చాలా సంతోషిస్తాడు. 
భగవంతునికి ఏమి సమర్పించాలి అన్నదానిగ్గూడా భగవద్గీతలో, 'పత్రం,పుష్పం,ఫలం,తోయం' అని చక్కగా చెప్పబడింది. ఒక ఆకుగాని,పువ్వు గాని,  పండు గాని,చివరకు కనీసం నీళ్ళైనా సమర్పిస్తే చాలని దీని అర్ధం. 
ఎవరో బాగా వున్నవాళ్లు ఆర్జిత సేవలు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి చేయిస్తారు. పెద్దగా నైవేద్యాలు సమర్పిస్తారు.విలువైన ఆభరణాలు సమర్పిస్తారు. అలా అని లేనివాళ్ళు కూడా అలా చెయ్యాలని లేదు. అలా చేస్తేనే భగవంతుడు అనుగ్రహిస్తాడని లేదు. అసలు వాస్తవానికి మనo ఏది నైవేద్యం పెట్టినా ఆయన తీసుకుంటున్నాడా? ఆయన వైపు చెయ్యి చూపించి, మనమే కదా మొత్తం, ప్రసాదం క్రింద, స్వీకరించేది.  ఒక పాత్రలో టిఫిన్ పెట్టి మన ఇంటికి వచ్చేవారికి ఇచ్చినపుడు వాళ్ళేo చేస్తున్నారు?టిఫిన్ స్వీకరించి, పాత్రను వదిలేస్తున్నారు. భగవంతుడైతే--మనo ఇచ్చే నైవేద్యం వెనుక వున్న మన భక్తి సమర్పణాభావాన్ని స్వీకరించి , నైవేద్యాన్ని మనకే వదిలేస్తాడు.  ఆ భక్తి సమర్పణ--నైవేద్యం పరిమాణం మీద,విలువ మీద ఆధారిపడి వుండదు గదా! అలా అయితే బాగా ఉన్నవారిది ఎక్కువ భక్తి ,లేని వారిది తక్కువ భక్తి అవుతుంది.ఇది ఎంత మాత్రo నిజమో మనకు తెలీదా?  అయినా కొండంత దేవునికి కొండంత పత్రి సమర్పించుకోగలమా ?
"పత్రంపుష్పం ఫలంతోయం "  అన్నదాంట్లో ఒక విచిత్రమైన అంతరార్థం వుంది.
1. 'పత్రం' అంటే- పడిపోయేది పత్రo.  మనిషిని పడేసేది--మనస్సు కాబట్టి --మనసే పత్రం.
2. 'పుష్పతీతి పుష్పం'--అంటే "వికసించేది పుష్పం. మనిషిలో వికసించేది బుధ్ధి--బుధ్ధియే పుష్పం.
3. ' ఫలతి '--విశీర్యతే  ప్రహరైః అంటే వేటుల చేత,  విశీర్యతే అంటే పగులునది-ఫలం.  జ్ఞానబోధ అనే దెబ్బల చేత పగిలేది మనసులోని 'అహoకారo' కాబట్టి , అహంకారమే --ఫలం !
4.త్రాయతేప్రాయతేతి--తోయం --రక్షించేది కనుక తోయం. సోహo భావం తో ఉన్నప్పుడు ధ్యేయాన్ని సరిగ్గా గుర్తుంచుకుని క్రమక్రమంగా రక్షించేది చిత్తమే కాబట్టి ఈ చిత్తమే --తోయం. భగవంతునిలో ఐక్యభావన కలిగినపుడు పరవశంతో కలిగే ఆనoదాశ్రువులే, ఈ తోయం.  ఐక్యభావన చిత్త లక్షణo కాబట్టి 'చిత్తమే-తోయం'.  భగవంతునికి సమర్పించే వాటిలో మన పతనానికి కారణమైన మనస్సును ముందు సమర్పించడo మంచిది కదా !
శివుని దగ్గర బంగారు కొండ , ధనపతి కుబేరుడు ,ఇంట్లో కల్పవృక్షం ,కామధేనువు ,చింతామణుల రాసులు వున్న ఆయనకు మనo ఇంకేo సమర్పించి తృప్తి పరచగలo!
అందుకని తేలిగ్గా ఇవ్వగలిగింది ,పైసా ఖర్చులేనిది ,--మనoపతనo కాకుండా వుండాలoటే, మనo భగవంతునికి సమర్పించవలసినదీ ,  సమర్పించ గలిగేది కూడా అయిన మనస్సుని సమర్పించడమే సముచితమని, శంకరులు శెలవిచ్చి, సూచించారు ఈ శ్లోకంలో...
ఏ పూజలోనైనా చిట్టచివరిగా మామూలు మనస్సు గాక  మంత్రపూతమైన మనస్సనే మంత్ర పుష్పాన్ని సమర్పించడo లోని అంతరార్థం ఇదే ! (పుష్పం అంటే ఐదురేకలు కలిగిన పువ్వు. అంటే పంచజ్ఞానేoద్రియాలతో కూడిన మనస్సే ఈ పుష్పం.)
వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts