విశాఖపట్నం మార్చి 9,
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ అగనంపూడిn, శనివాడ కూడలి వద్ద 79, 85వ వార్డు అఖిలపక్ష కార్పొరేటర్ అభ్యర్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైకాపా సేవాదళ్ జనరల్ సెక్రటరీ ఇల్లపు ప్రసాద్ మాట్లాడుతూ నిర్వాసితులకు, ఉద్యోగులకు వైకాపా ప్రభుత్వం అండగా నిలుస్తుందని, అవసరమైతే రిలే నిరాహార దీక్ష చేపడతామని అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాలతో మారుమ్రోగిన ధర్నా కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు పాల్గొని నిర్వాసితులకు అండగా నిరసన తెలియజేశారు. అలాగే 79 వ వార్డు స్వతంత్ర అభ్యర్థి పూర్ణ మాట్లాడుతూ స్థానికులకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా అన్నారు. సీనియర్ నాయకుడు బలిరెడ్డి నాగేశ్వరరావు మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వంతో పోట్లాడి ప్రభుత్వ రంగ సంస్థగా నిలబెట్టామని అన్నారు. 79 వ వార్డు జనసేన అభ్యర్థి కింతాడ ఈశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో జనసేన ఉద్యమం చేపడతామని అన్నారు. నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు అఖిలపక్ష నాయకులు అందరూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో మాట పైకి వచ్చి ఆందోళన చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నిర్వాసితులు, ఉద్యోగస్తులు భారీ ఎత్తున నిరసన తెలియజేసి ఆందోళన చేపట్టారు.