YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం

జగన్ వంచన సభతో ఉత్తరాంధ్రపై పట్టు

జగన్ వంచన సభతో ఉత్తరాంధ్రపై పట్టు

ఇప్పటికే రాయలసీమ, కోస్తాంధ్రలో తన పాదయాత్ర ద్వారా కొంత పట్టు సాధించిన వైసీపీ అధినేత జగన్ ఉత్తరాంధ్ర జిల్లాపై పట్టు సాధించేందుకు సిద్ధమయ్యారు. ఉత్తరాంధ్రలో్ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో వైసీపీకి నాయకత్వం పటిష్టంగా ఉన్నప్పటికీ, విశాఖలో మాత్రం సరైన నాయకుడు లేకపోవడం ఆ పార్టీకి మైనస్ పాయింటే. విశాఖలోపార్టీని ముందుకు నడిపించే నాయకుడే లేరు. నాయకత్వ సమస్య విశాఖ జిల్లాలో వైసీపీని పట్టి పీడిస్తుంది. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసుకుని మరో రెండు నెలల్లో విశాఖ జిల్లాలోకి అడుగుపెట్టనున్నారు.ఈ నెల 30వ తేదీన తిరుపతిలో చంద్రబాబు బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ బహిరంగ సభ ద్వారా ప్రధాని మోడీపై నేరుగా ధ్వజమెత్తాలని నిర్ణయించారు. తిరుపతి కేంద్రంగా… వెంకన్న సాక్షిగా మోడీ గతంలో ఇచ్చిన హామీలను గుర్తు చేసేందుకు తిరుపతిలోనే చంద్రబాబు ఈ సభను ఏర్పాటు చేశారు. అయితే అదే రోజు వైసీపీ విశాఖపట్నంలో వంచన దీక్షను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ ను హామీల పేరుతో వంచించాయని, అందుకే వంచన దీక్ష పేరుతో తాము కార్యక్రమం చేపడుతున్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు.ఈ దీక్షలో రాజీనామాలు చేసిన వైసీపీ పార్లమెంటు సభ్యులతో పాటు, ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు పెద్దయెత్తున పాల్గొనాలని ఆదేశాలు వెళ్లాయి. విశాఖ రైల్వే జోన్ ఇస్తామని ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని, అలాగే వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుండా మభ్యపెట్టిందని వైసీపీ ఆరోపిస్తోంది. హామీలను సాధించడంలో తెలుగుదేశం ప్రభుత్వం నాలుగేళ్ల నుంచి విఫలమయిందన్న విషయాన్ని కూడా ఈ దీక్ష ద్వారా గుర్తు చేయనున్నారు. ఈ దీక్ష ద్వారా విశాఖ జిల్లాలో బలం పెంచుకోవడంతో పాటు, నాయకత్వాన్ని కూడా రప్పించుకోవాలన్నది ఆ పార్టీ వ్యూహంగా కన్పిస్తోంది.ప్రస్తుతం విశాఖ జిల్లాలో పార్టీ వ్యవహారాలన్నింటినీ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి దగ్గరుండి చూస్తున్నారు. ఆయన ప్రతి శని, ఆదివారాల్లో విశాఖలోనే పర్యటిస్తున్నారు. కాని విజయసాయిరెడ్డి స్థానికేతరుడు కావడంతో కొంత ఇబ్బందే ఎదురవుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు వైసీపీ నాయకత్వం కోసం ఎదురు చూస్తోంది. విశాఖ జిల్లాలో పేరున్న సబ్బం హరి, కొణతాల రామకృష్ణ వంటి నేతలు పార్టీని వీడి వెళ్లడం కూడా ఆ పార్టీకి నష్టమే. దీంతో నష్ట నివారణ చర్యలకు జగన్ దిగారు. విశాఖలో వైసీపీ నేతల్లో జోష్ ను నింపాలని నిర్ణయించుకున్నారు.

Related Posts