న్యూ ఢిల్లీ మార్చ్ 9 ఆంధ్రప్రదేశ్ లో మున్సిపాలిటీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్ ను సుప్రీం కోర్టు ధర్మాసనం తిరస్కరించింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి కొత్త నోటిఫికేషన్ అవసరమా లేదా అన్నది ఎస్ఈసీ విచక్షణాధికారం అని సుప్రీం స్పష్టం చేసింది.ఏపీలో మున్సిపల్ ఎన్నికలపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని కడప జిల్లాకు చెందిన కొందరు సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు.దీనిపై విచారణ జరిపిన జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించడం సరికాదని అభిప్రాయపడింది.ఎన్నికల నిర్వహణ ఎన్నికల కమిషన్ హక్కు అని స్పష్టం చేసింది. కడప వాసులు వేసిన పిటీషన్ ను ధర్మాసనం కొట్టివేసింది.అంతకుముందు పిటిషనర్లు దీనిపై ఏపీ హైకోర్టును ఆశ్రయించగా పిటీషన్ ను తిరస్కరించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 12 నగరపాలిక 71 పురపాలక సంస్థలు నగర పంచాయతీల్లో బుధవారం పోలింగ్ జరుగబోతోంది.