లండన్ మార్చ్ 9 భారత్‌లో జరుగుతున్న రైతు నిరసనలు, పత్రికా స్వేచ్ఛ అంశాలపై సోమవారం రోజున బ్రిటీష్ పార్లమెంట్‌లో చర్చ చేపట్టారు. బ్రిటన్ ఎంపీలు ఈ అంశాలపై చేపట్టిన చర్చను లండన్‌లో ఉన్న భారతీయ హై కమీషన్ తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో హై కమీషన్ పత్రికా ప్రకటనను రిలీజ్ చేసింది. చర్చ సరైన రీతిలో సమతుల్యంగా జరగలేదని, తప్పుడు ఆరోపణలతో చర్చించారని, తమ వాదనలకు ఎటువంటి ఆధారాలు లేవని, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంపై అనుచిత ఆరోపణలు చేస్తున్నారని, భారత వ్యవస్థలను తప్పుగా చిత్రీకరిస్తున్నారని హై కమీషన్ తన లేఖలో పేర్కొన్నది. విదేశీ మీడియాతో పాటు బ్రిటీష్ మీడియా కూడా ఇండియాలో ఉన్నదని, భారత్‌లో పత్రికా స్వేచ్ఛ లేదన్న అంశం ఏ రకంగా ఉత్పన్నంకాదు అని భారతీయ హై కమీషన్ తన ప్రకటనలో స్పష్టం చేసింది. సోమవారం రోజున బ్రిటీష్ పార్లమెంట్ సుమారు 90 నిమిషాలు భారత్‌లో జరుగుతున్న రైతు నిరసనలపై చర్చించింది. అలాగే ఇండియాలో ఉన్న ప్రెస్ ఫ్రీడం అంశాన్ని కూడా చర్చించారు. రైతు నిరసనల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరును లేబర్ పార్టీ, లిబరల్ డెమోక్రాట్స్, స్కాటిష్ నేషనల్ పార్టీ ఎంపీలు ఖండించారు. త్వరలో ప్రధాని మోదీతో బ్రిటన్ ప్రధాని కలుసుకుంటారని, ఆ సమయంలో రైతు నిరసనల అంశాన్ని లేవనెత్తుతామని బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించింది. భారత సంతతికి చెందిన లిబరల్ డెమోక్రాట్ నేత గుర్చ్ సింగ్ వేసిన పిటిషన్ ఆధారంగా బ్రిటన్ పార్లమెంట్‌లో చర్చ చేపట్టారు. ఆ పిటిషన్‌పై బ్రిటన్‌లో ఉన్న స్థానికుల నుంచి లక్షల సంఖ్యలో సంతకాలు సేకరించారు.స్కాటిష్ నేషనల్ పార్టీకి చెందిన మార్టిన్ డే.. ఈ అంశంపై చర్చను మొదలుపెట్టారు. రైతు సంస్కరణలు భారత ప్రభుత్వ నిర్ణయాలని, ఆ సంస్కరణల గురించి మనం చర్చించడం లేదని, కేవలం నిరసనకారుల రక్షణ గురించి మాత్రమే చర్చిస్తున్నామని మార్టిన్ అన్నారు. రైతు నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారని, పలు చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయని, ఇంటర్నెట్ కనక్టివిటీ దెబ్బతిన్నట్లు ఆయన చెప్పారు. రైతు నిరసనలకు మద్దతుగా బ్రిటన్ ఎంపీలు మాట్లాడినా.. ఆ దేశానికి చెందిన ఆసియా విదేశాంగ మంత్రి నీగల్ ఆడమ్స్ భారత ప్రభుత్వానికి బాసటగా నిలిచారు. లేబర్ పార్టీ నేత జెర్మీ కార్బిన్ మాట్లాడుతూ.. ఎందుకు రైతులు అంత పెద్ద సంఖ్యలో నిరసనలు చేపడుతున్నారో ఆలోచించాలన్నారు. జర్నలిస్టుల అరెస్టు ఆందోళన కలిగిస్తున్నదన్నారు. బ్రిటన్‌లోనూ నిరసనలు జరిగినప్పుడు పోలీసులకు వ్యతిరేకంగా ఫిర్యాదులు అందుతుంటాయని, అంటే దాని అర్థం ప్రజాస్వామ్యానికి బ్రిటన్ వ్యతిరేకం కాదు అని కన్జర్వేటివ్ ఎంపీ థెరిసా విల్లియర్స్ తెలిపారు. బ్రిటన్ పార్లమెంట్‌లో జరిగిన చర్చ గురించి లండన్‌లోని భారతీయ హై కమిషన్ తన ప్రకటనలో ప్రస్తావిస్తూ.. భారత్‌తో మైత్రి కలిగి ఉన్న దేశాలు ఎటువంటి తప్పుడు ఆరోపణలు చేసినా.. ఆ అంశాలను సరిచేయడం తమ కర్తవ్యమని పేర్కొన్నది. మూడు కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే.