న్యూఢిల్లీ, మార్చి 9
ఉత్తరాఖండ్ రాజకీయాల్లో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. త్రివేంద్ర సింగ్ రావత్.. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన గవర్నర్ బేబి రాణి మౌర్యను కలిసి రాజీనామా లేఖను అందజేశారు. బీజేపీ అధిష్టానం ఆదేశాలతోనే రావత్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అధిష్టానం సూచనతో ఆ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేసులో పలువురు అభ్యర్థులు ఉన్నారు.నేను ఎంతో కాలంగా రాజకీయాల్లో ఉన్నాను. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి నాలుగేళ్ల పాటు సేవే చేసే సువర్ణావకాశం లభించింది. ఇలాంటి అవకాశం దక్కుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. పార్టీ ఈ అవకాశాన్ని ఇప్పుడు మరొకరికి ఇవ్వాలని భావిస్తోంది’ అని త్రివేంద్ర సింగ్ రావత్ అన్నారు. రాజీనామా లేఖ సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.త్రివేంద్ర సింగ్ రావత్ పాలనపై సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొంత కాలంగా నాయకత్వ మార్పు చేయాలని బీజేపీ అధిష్టానాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రావత్ రాజీనామా చేస్తారని ఇటీవల వార్తలు జోరందుకున్నాయి.